హైదరాబాదులో మరోసారి వర్షం రావడంతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలో పలు కాలనీలు ఇప్పటికే వరద ముంపులకు గురయ్యాయి.
ఇదిలావుంటే హైదరాబాదులో శనివారం నాడు గంట నుంచి పలు చోట్ల వర్షం దంచికొడుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాలు నీట మునిగి ఉండగా మళ్లీ వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నగరంలో గంట నుంచి వర్షం విడవకుండా పడుతుండగా ప్రజలు అతలాకుతలమవుతున్నారు.
మరో వైపు ఏపీలోను వర్షం దంచి కొడుతోంది. విజయవాడ, తిరుపతిలోనూ వర్షం విడవకుండా పడుతోంది. ఒకవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, మరోవైపు ఈశాన్య అరేబియా సముద్రంలో అల్ప పీడనం వెరసి తెలుగు రాష్ట్రాలను వర్షం కుదిపేస్తోంది.