తెలంగాణ రాష్ట్రంలోని మన్నెగూడ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా వినోద్ గౌడ్ ఉన్నారు. ఈయన గతంలో ఉత్తమ సర్పంచ్ అవార్డును సైతం అందుకున్నారు. ఆ సమయంలో ఆయన్ను ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. కానీ, ఆయనలో మరో కోణం దాగివుందన్న విషయం ఇపుడు బహిర్గతమైంది. అదే లంచగొండి వినోద్ గౌడ్. ఏకంగా 13 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబట్టారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగిందీ ఘటన.
ఏసీబీ కథనం ప్రకారం.. జిల్లాలోని పూడూరు మండలం మన్నెగూడ ప్రధాన రహదారిపై తనకున్న 27 గుంటల భూమిలో దుకాణ సముదాయం నిర్మించాలని ముజాహిద్ అలం అనే వ్యక్తి నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అవసరమైన అన్ని అనుమతులను హెచ్ఎండీఏ నుంచి తీసుకున్నాడు. నెల రోజుల క్రితం భవన నిర్మాణం కూడా ప్రారంభించాడు.
ఈ విషయం తెలిసిన మన్నెగూడ సర్పంచ్ వినోద్ గౌడ్ అక్కడ వాలిపోయాడు. తనకు రూ.20 లక్షలు ఇస్తేనే పనులు జరగనిస్తానని, లేదంటే పనులు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలబోవని ముజాహిద్‌ను హెచ్చరించాడు. అయితే, తాను అంత సొమ్ము ఇచ్చుకోలేనని చెప్పడంతో చివరికి రూ.13 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు.
సొమ్ము సర్దుబాటు చేశానని వచ్చి తీసుకోవాలని సర్పంచ్ వినోద్‌కు ముజాహిద్ ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆ సొమ్ము పట్టుకుని బండ్లగూడలోని ఆరెమైసమ్మ వద్దకు తీసుకురావాలని సూచించాడు.
అతడు చెప్పినట్టే అక్కడకు డబ్బుతో వెళ్లిన ముజాహిద్ కారులో ఉన్న సర్పంచ్‌కు డబ్బులు అందించాడు. అక్కడే మాటువేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడిచేసి ఆ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వినోద్ గౌడ్‌ను శనివారం చంచల్‌గూడ జైలుకు తరలించనున్నట్టు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.
ఏసీబీకి పట్టుబడిన వినోద్ గతేడాది రిపబ్లిక్ డే నాడు జిల్లా కలెక్టర్ నుంచి ఉత్తమ సర్పంచ్ అవార్డు అందుకోవడం గమనార్హం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి గత చరిత్రను కూడా వెలికి తీసే పనిలో నిమగ్నమయ్యారు.