కొన్ని గ్రామాలు అటవీ ప్రాంతాలు చేరువలో ఉండటం వల్ల అప్పడప్పుడు క్రూర మృగాల దాడికి గురవుతుంటారు అక్కడి ప్రజలు. ముఖ్యంగా పులులు జానాసంలోకి వస్తూ ఆవులపై, సాధు జంతువులపై, మనుషులపై తన పంజాను విసురుతుంటాయి. అలాంటి ఘటనే ఇక్కడ ఓ యువకుడి ప్రాణాలను బలితీసింది.
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కొమురం భీమ్ జిల్లాలో పెద్ద పులి దాడి కలకలం రేపింది. దహేగాం రాంపూర్ అటవీ ప్రాంతంలో ఓ పెద్దపులి దాడి చేయడంతో 20 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. యువకుడిని చంపిన పులి అతడి మృతదేహాన్ని అడవిలోకి లాక్కెళ్లింది.
సమాచారం అందుకున్న అటవీ, పోలీసు శాఖ అధికారులు, ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పరిశీలించారు. పెద్దపులి దాడికి ఒక్కసారిగా రాంపూర్ గ్రామం ఉలిక్కిపడింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో వణుకుతున్నారు గ్రామస్తులు. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుని పెద్దపులిని బంధించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.