హైదరాబాదులో భారీ వర్షాల కారణంగా మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. సికింద్రాబాద్‌లోని కళాసిగూడలో తెరచి వుంచిన మ్యాన్ హోల్‌లో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పాలప్యాకెట్ కోసం వెళ్లిన చిన్నారి మౌనిక డ్రైనేజీలో పడి కొట్టుకుపోయింది. పార్క్ లైన్ వద్ద మౌనిక మృతదేహాన్ని డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు.
చిన్నారి మరణానికి జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. శనివారం భారీ వర్షాలతో రోడ్లు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు వరదతో నిండిపోయాయి. మ్యాన్ హోల్స్ నుంచి నీరు పొంగిపొర్లుతోంది. కళాసీగూడలో ఓ మ్యాన్ హోల్ తెరిచి ఉంచడంతో ప్రమాదం జరిగింది.
చిన్నారి కోసం గాలించగా.. పార్క్ లైన్ వద్ద పాప మృతదేహం బయటపడింది. పాల ప్యాకెట్ కోసం వెళ్లిన పాప ఇలా మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు.