పట్టణ ప్రాంతాల్లో మారువేషంలో ఉండే మావోయిస్టుల మాట విని యువత పెడదారి పట్టవద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. మావోయిస్టులు ఏసీ గదుల్లో కూర్చొని పైరవీలు చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారని, మావోల మాటలు విని నక్సలిజం వైపు మళ్లిన యువతి మాత్రం క్షేత్రస్థాయిలో ప్రజా వ్యతిరే పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతుంటారన్నారు. అందువల్ల అర్బన్ నక్సలైట్ల మాట వినొద్దని ఆయన కోరారు.
ఆయన తెలంగాణాలోని వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బుల్లెట్లను నమ్ముకున్న మావోయిస్టులు ఏం సాధించారని ప్రశ్నించారు. 'ఇన్నాళ్లూ తుపాకీ చేతబట్టిన హిడ్మా ఏం సాధించారు. ఇవాళ ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగి ఎదురుకాల్పుల్లో హిడ్మా, ఆయన భార్య చనిపోయారు. తుపాకీ చేతపట్టుకొని చర్చలు కావాలంటే కుదరదు. ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టులంతా క్షేమంగా ఉన్నారు. బుల్లెట్లను నమ్ముకొని ఏం సాధించలేరు. బ్యాలెట్‌ను నమ్ముకోండి' అని బండి సంజయ్ అన్నారు.
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం వేకువజామున భద్రతా బలగాలు - మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా మృతిచెందాడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించిన డెడ్‌లైన్ కంటే ముందే హిడ్మాను ఎన్‌కౌంటర్ చేయడం గమనార్హం. నవంబరు 30వ తేదీలోపు హిడ్మా ఆటకట్టించాలని భద్రతా బలగాలను అమిత్‌షా ఆదేశించినట్లు సమాచారం.
'2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించాలని అమిత్ షా గడువు విధించారు. ఈ క్రమంలో జరిగిన భద్రతా సమీక్షా సమావేశంలో నవంబరు 30వ తేదీలోగా హిడ్మా పనిపట్టాలని భద్రతా బలగాలకు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఆ డెడ్‌లైన్ కన్నా ముందుగానే ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో హిడ్మా మృతిచెందడం గమనార్హం' అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఆపరేషన్‌ను చూస్తుంటే దేశంలో నక్సలిజాన్ని మార్చి కంటే ముందుగానే తుడిచివేసేలా కనిపిస్తున్నారు.
దేశంలో మావోయిస్టుల హింస, భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించారని గతంలో అమిత్ షా వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. హింసను, ఆయుధాలను వదిలేసి వారు లొంగిపోవాలని లేకపోతే మావోయిస్టుల అంతానికి ఆల్ - అవుట్ ఆపరేషన్ నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.