తల్లిదండ్రులు పెళ్లి ఆలస్యం చేస్తున్నారని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిర్మల్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... పట్టణంలోని కుంట ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్(22) పెళ్లి ఆలస్యమవడంతో మనస్తాపానికి గురై ఈ దారుణానికి ఒడిగట్టాడని, తల్లిదండ్రుల నిరాసక్తత వల్లే ఇలా జరిగిందని భైంసా ఇన్‌స్పెక్టర్ డి.రాజా తెలిపారు. క్రమం తప్పకుండా పెళ్లి చేయాలంటూ తల్లిదండ్రులతో గొడవ పడేవాడని.. వారు పెద్దగా పట్టించుకోలేదని రాజా అన్నారు.
దీంతో సోమవారం సాయంత్రం గడ్డెన్నవాగు సాగునీటి ప్రాజెక్టులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన స్నేహితుడు షకీల్‌తో కలిసి ప్రాజెక్టును సందర్శించిన ఇమ్రాన్ ఒక్కసారిగా నీళ్లలో మునిగిపోయాడు. వెంటనే షకీల్ సహాయం కోసం స్థానిక పోలీసులకు ఫోన్ చేశాడు. మంగళవారం మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు,