భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావును తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు మంగళవారం కలిశారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లను ఆయన మర్యాదపూర్వకంగా సమావేశమైన విషయం తెల్సిందే. తాజాగా మాజీ మంత్రి హరశ్ రావుతో భేటీ అయ్యారు. హైదరాబాద్ నగరంలోని హరీశ్ రావు నివాసానికి బీఆర్ నాయుడు వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా హరీశ్ రావు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరింసి, బీఆర్ నాయుడుకి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, హరీశ్ రావుకు కూడా శాలువా కప్పి, శ్రీవారి ప్రసాదాలను బీఆర్ నాయుడు అందజేశారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, శ్రీవారికి సేవ చేసే భాగ్యం బీఆర్ నాయుడుకి లభించడం అదృష్టమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా బీఆర్ నాయుడుని కోరినట్టు చెప్పారు. అలాగే, సిద్ధిపేటలో తితిదే ఆలయం నిర్మాణ పనులన త్వరగా ప్రారంభించాలని కోరారు.
ఆ తర్వాత బీఆర్ నాయుడు మాట్లాడుతూ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి, తెలంగాణ నేతల సిఫారసు లేఖలపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. సిద్ధిపేట, కరీంనగర్‌లలో తితిదే ఆలయ పనులపై బోర్డులో చర్చిస్తామని తెలిపారు.