తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఈ నెల 7న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు మంత్రులు ప్రమాణం చేయనున్నట్లు సమాచారం.
రేవంత్ రెడ్డికి సీఎం పదవి దక్కడంతో మరో ముగ్గురికి డిప్యూటీ సీఎం పదవులు దక్కనున్నట్లు సమాచారం. దళిత సామాజికవర్గం నుంచి మల్లు భట్టి విక్రమార్క, బీసీ సామాజికవర్గం నుంచి పొన్నం ప్రభాకర్, ఎస్టీ సామాజికవర్గం నుంచి సీతక్క డిప్యూటీ సీఎంలు అయ్యే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన 64 మంది ఎమ్మెల్యేల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. వారిలో ఎక్కువ మంది కొత్తవారే. కొందరు సీనియర్లు ఉన్నారు.
వెలమ సామాజిక వర్గ కోటాలో మంచిర్యాల్ నుంచి గెలిచిన ప్రేమ్ సాగర్ రావు, జూపల్లి కృష్ణారావు, గండ్ర సత్యనారాయణరావులు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు.
ఇద్దరు నుంచి నలుగురు మహిళా అభ్యర్థులకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. మాజీ మంత్రి కొండా సురేఖ, సీతక్క, పద్మావతి రెడ్డి ముందంజలో ఉన్నారు.