హైదరాబాద్- విజయవాడ మధ్య ప్రీమియం బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ కొత్త తగ్గింపును ప్రకటించింది. ఈ ఏడాది టీజీఎస్సార్టీసీ రేట్ల తగ్గింపు ఇదే రెండోసారి కావడం గమనార్హం. గరుడ ప్లస్, ఈ-గరుడ సర్వీసులపై 30 శాతం తగ్గింపు, సూపర్ లగ్జరీ, లహరి (నాన్ AC) సర్వీసులపై 20 శాతం తగ్గింపు ఉంది.
అధిక డిమాండ్ ఉన్న కారిడార్‌పై ప్రైవేట్ ఆపరేటర్లు, పోటీ పడుతున్న రాష్ట్ర క్యారియర్ ఏపీఎస్సార్టీసీ ఎక్కువ ధరలకు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరిలో, టీజీఆర్టీసీ లహరి (నాన్ ఏసీ) స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసులపై 10 శాతం తగ్గింపును.. ఈ రూట్‌లోని రాజధాని ఏసీ బస్సులపై 8 శాతం తగ్గింపును అందించింది.
హైదరాబాద్-విజయవాడ తెలంగాణ రాజధాని నుండి అత్యంత రద్దీగా ఉండే ఇంటర్‌సిటీ రూట్లలో ఒకటి. హైదరాబాద్ నుండి విజయవాడకు ప్రతిరోజూ దాదాపు 120 బస్సులు బయలుదేరుతాయి. ఈ సర్వీసులు 10-30 నిమిషాల వ్యవధిలో 24 గంటలూ నడుస్తాయి.
దీనిపై రంగారెడ్డి ప్రాంతీయ మేనేజర్ శ్రీలత మాట్లాడుతూ: "మేము భద్రత-సేవా ప్రమాణాలకు ప్రాధాన్యత ఇస్తాం. మార్కెట్ పోటీకి అనుగుణంగా మేము ధరలను తగ్గించాము. ఈ రూట్‌లో, ముఖ్యంగా ఎల్బీ నగర్ నుండి, విజయవాడకు బస్సులు దాదాపు ప్రతి 10 నిమిషాలకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు... అంటూ తెలిపారు.