ఇటీవలి సంవత్సరాలలో దక్షిణ భారతదేశం అంతటా మద్యం వినియోగం గణనీయంగా పెరిగింది. ఫలితంగా, మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం కూడా విపరీతంగా పెరిగింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ, ఎక్సైజ్ శాఖ నివేదికల ప్రకారం, ప్రస్తుతం తెలంగాణ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.
తెలంగాణలో ఒక్కో వ్యక్తి సగటు మద్యం వినియోగం 4.44 లీటర్లుగా ఉంది. 4.25 లీటర్లతో కర్ణాటక ఆ తర్వాతి స్థానంలో ఉంది. తమిళనాడులో ఒక్కో వ్యక్తికి 3.38 లీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 2.71 లీటర్లు, కేరళలో 2.53 లీటర్ల వినియోగం నమోదైంది. తెలంగాణలో నగరాల కంటే గ్రామాల్లోనే మద్యం వినియోగం ఎక్కువగా ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా బీర్ వినియోగం కూడా గణనీయంగా ఎక్కువగా ఉంది. ఈ ధోరణులు గ్రామీణ ప్రాంతాల్లో మారుతున్న మద్యపాన అలవాట్లను సూచిస్తున్నాయి. దక్షిణ రాష్ట్రాలలో తెలంగాణలో మద్యంపై చేసే ఖర్చు అత్యధికంగా ఉంది. సగటున ఒక వ్యక్తి సంవత్సరానికి మద్యంపై రూ. 11,351 ఖర్చు చేస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో వ్యక్తిపై ఈ ఖర్చు రూ. 6,399గా ఉంది. మద్యం అమ్మకాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ. 36,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందని అంచనా. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నప్పటికీ, దీని దీర్ఘకాలిక ప్రభావంపై నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెరుగుతున్న మద్యం ఖర్చు ఆర్థిక ఒత్తిడికి, ఆరోగ్య క్షీణతకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో వినియోగ స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఈ గణాంకాలు చూపిస్తున్నాయి. ఈ ధోరణి ఆందోళనకరమని, దీనిపై తక్షణమే దృష్టి సారించాలని నిపుణులు అంటున్నారు.