టీడీపి విజయాన్ని కార్యకర్తలతో కలిసి ఎంజాయ్ చేసారు తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. మంగళవారం నాడు ఎన్నికల ఫలితాల సరళిలో తెదేపా దూసుకుపోతుండటంతో ఖమ్మం జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. అటుగా వెళ్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కారును ఆపి తెదేపా కార్యకర్తలకు శుభాకాంక్షలు చెబుతూ వారితో కలిసి కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసారు తెదేపా కార్యకర్తలు.
అసెంబ్లీ ఎన్నికల్లో మెజరిటీ వీరులు వీరే
ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయభేరీ మోగించింది. అధికార వైకాపా చిత్తు చిత్తుగా ఓడిపోయింది. వై నాట్ 175 అనే నినాదంతో బరిలోకి దిగిన జగన్ నేతృత్వంలోని వైసీపీకి రాష్ట్ర ఓటర్లు దిమ్మతిరిగే ఫలితాలను కట్టబెట్టారు. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి సునామీ సృష్టించిన ఆ పార్టీ.. ఈ సారి సైకిల్ స్పీడు ముందు తేలిపోయింది. దీంతో ఆ పార్టీ కేవలం 11 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇక టీడీపీ కూటమి ఏకంగా 164 సీట్ల అఖండ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో కూటమి అభ్యర్థులు కొన్ని చోట్ల ఇంతకుముందెన్నడూ లేని విధంగా భారీ మెజారిటీలు సాధించడం జరిగింది. గాజువాక నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ ఏకంగా 95,235 ఓట్ల తేడాతో గెలుపొందారు. అలాగే భీమిలి నుంచి గంటా శ్రీనివాస్ 92,401, మంగళగిరి నుంచి నారా లోకేశ్ 91,413 ఆధిక్యంతో విజయం సాధించారు.
అలాగే, పెందుర్తి నుంచి జనసేన అభ్యర్థి రమేశ్ 81,870, నెల్లూరు అర్బన్ నుంచి టీడీపీ అభ్యర్థి నారాయణ 72,489, తణుకు నుంచి టీడీపీ అభ్యర్థి రాధాకృష్ణ 72,121, కాకినాడ రూరల్ నుంచి జనసేన నానాజీ 72,040, రాజమండ్రి అర్బన్ నుంచి టీడీపీ శ్రీనివాస్ 71,404, పిఠాపురం నుంచి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ 70,279 ఓట్ల భారీ మెజారిటీలను నమోదు చేశారు.