Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దక్షిణ భారతదేశానికి తెలంగాణ ఓ గేట్‌వే : ప్రధాని నరేంద్ర మోడీ

narendra modi

ఠాగూర్

, మంగళవారం, 5 మార్చి 2024 (16:12 IST)
దక్షిణ భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం ఓ గేట్ వే వంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆయన గత రెండు రోజులుగా పర్యటిస్తున్నారు. రెండో రోజైన మంగళవారం సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పటేల్ గూడాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సభావేదికపైకి నరేంద్ర మోడీని బీజేపీ నేతలు పూల రథంలో ఆహ్వానించారు. ఓపెన్ టాప్ జీప్‌ను పూలదండలతో అలంకరించి మోడీని అందులో తోడ్కొని వెళ్లారు. ప్రధాని మోడీతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కిషన్ రెడ్డి వాహనంలో వేదికపైకి చేరుకున్నారు. బీజేపీ కార్యకర్తలు మోడీపై పూల వర్షం కురిపించారు.
 
ఈ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, తెలంగాణ ప్రజలతో రెండో రోజు కూడా ఉండటం సంతోషంగా ఉందన్నారు. సంగారెడ్డిలో రూ.9 వేల కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించామని, దేశంలోనే తొలి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్‌‌ను బేగంపేటలో ప్రారంభించామని చెప్పారు. దీంతో ఏవియేషన్ రంగంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్నారు. పదేళ్లలో దేశంలో ఎయిర్ పోర్టుల సంఖ్య రెట్టింపు చేశామని ఆయన తెలిపారు. 
 
ఘట్ కేసర్ - లింగంపల్లి మధ్య ప్రారంభించిన ఎంఎంటీఎస్ రైళ్లతో కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని తమ ప్రభుత్వం నమ్ముతుందని మోడీ చెప్పారు. ఈ సందర్భంగా తనకు కుటుంబం లేదంటూ ఇండియా కూటమి నేత లాలూ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై మోడీ విమర్శలు గుప్పించారు. 140 కోట్లకు పైగా ఉన్న భారతీయులంతా తన పరివారమే (కుటుంబమే) అని చెప్పారు. 'మేమే మోడీ కుటుంబం' అని తెలుగులో చెబుతూ సభకు హాజరైన జనంతో తిరిగి చెప్పించారు.
 
అంతకుముందు ఆయన మంగళవారం ఉదయం సికింద్రబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు, అధికారులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం చేయించి, ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి వస్త్రం, ఫొటో ఫ్రేమ్, తీర్థప్రసాదాలను మోడీకి అందజేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాహేతర సంబంధం.. భార్యను రాయితో తలుపై కొట్టి హత్య