రైతు భరోసా పథకాన్ని పారదర్శకంగా అమలు చేయడానికి ప్రభుత్వం విధివిధానాలు, మార్గదర్శకాలను సిద్ధం చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ పథకం కింద వ్యవసాయ కూలీలకు కూడా రూ.12,000 సహాయం అందజేయనున్నట్లు ప్రకటించారు.
గోల్కొండ కోట ప్రాకారంపై స్వాతంత్య్ర దినోత్సవ కవాతును స్వీకరించిన రేవంత్ రెడ్డి ఆపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... రైతు భరోసా పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఎకరాకు రూ. 15,000 అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ప్రకటించారు. రైతు భరోసాపై రైతులు, వ్యవసాయ కార్మికులు, మేధావులు, రైతు సంఘాల నుంచి అభిప్రాయాలు, సూచనలు తీసుకోవడానికి కేబినెట్ సబ్‌కమిటీని కూడా ఏర్పాటు చేశామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించామని రేవంత్ గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. ఫసల్ బీమా యోజన పథకం అమలు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. ప్రభుత్వం రైతుల తరపున ప్రీమియం చెల్లిస్తుంది. రైతు సంఘంపై ఎలాంటి భారం పడకుండా పంటలకు భద్రత కల్పిస్తుంది.
రైతు రుణమాఫీ పథకం కింద జూలై 18న ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.6,098 కోట్లు జమ చేసిందని, మొదటి విడతలో రూ.లక్ష వరకు రుణభారం నుంచి వారిని విముక్తుల్ని చేశామని ముఖ్యమంత్రి చెప్పారు. రెండో దశలో 6.40 లక్షల మంది రైతులు వ్యవసాయ రుణమాఫీ పథకం ప్రయోజనం పొందారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి, రాష్ట్ర అప్పుల పునర్నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు.