తెలంగాణ రాష్ట్రంలోని పాల్వంచలో రెండో పెళ్లికి అంతరాయం ఏర్పడింది. ఓ ప్రైవేట్ టీచరైన వధువును, ఓ ప్రభుత్వ టీచరైన వరుడుకి ఇచ్చి వివాహం చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. ఇంతలో మరో ప్రభుత్వ టీచర్ ఎంటరై... పెళ్ళిని ఆపాలంటూ గగ్గోలుపెట్టాడు. వధువును తాను ఇష్టపడుతున్నానంటూ హంగామా చేశాడు. దీంతో పెళ్లి ఆగిపోయింది. దీనిపై వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, పాల్వంచకు చెందిన 29 యేళ్ల మహిళ స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఆమెకు వివాహం కాగా, ఓ పాప కూడా ఉంది. అయితే, భర్తతో మనస్పర్థలు కావడంతో విడాకులు తీసుకుంది.
మరోవైపు, ఖమ్మంలో పని చేస్తున్న 33 యేళ్ల ప్రభుత్వ ఉపాధ్యాయుడుకి కూడా ఇది రెండో వివాహం. కొన్నేళ్ల క్రితం అయన భార్య మరణించారు. ఇరు కుటుంబాల పెద్దలు వీరిద్దరికీ వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నారు. శనివారం సాయంత్రం పాల్వంచలోని ఓ ప్రార్థనా మందిరంలోని పెళ్లి వేడుకకు అన్ని ఏర్పాట్లుచేశారు.
అంతా సవ్యంగా జరుగుతుందనుకుంటున్న సమయంలో గుండాలకు చెందిన మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు పెళ్లి వేదిక వద్దకు దూసుకొచ్చాడు. ఈ అమ్మాయి నాకు తెలుసు. ప్రైవేట్ స్కూల్‌లో పని చేస్తున్నప్పటికీ నుంచి మేమిద్దరం ఇష్టపడుతున్నాం. నాకు పెళ్లియినా పిల్లలు లేరు. నా భార్యకు విడాకులు వచ్చి ఈమెను పెళ్లి చేసుకుంటాను అంటూ పెద్దగా కేకలు వేస్తూ రభస సృష్టించాడు.
ఈ హఠాత్ పరిణామంతో వధువు, వరుడు కుటుంబ సభ్యులు, బంధువులు షాక్‌కు గురయ్యారు. వధువు తరపు వారు మాట్లాడుతూ, గతంలో ఆయన మా అమ్మాయిని ఇష్టపడుతున్నారని చెప్పాడు. కానీ, మా అమ్మాయి తల్లిదండ్రులు చూసిన సంబంధమే చేసుకుంటానని స్పష్టం చేసింది. దానిని మనసులో పెట్టుకుని ఇపుడు పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నాడు.
గతంలో వరుడికి కూడా ఫోన్ చేసి వధువుతో వివాహేతర సంబంధం ఉందని తప్పుగా చెప్పాడు. ఇపుడు ఏకంగా పెళ్లి మండపానికే వచ్చి గొడవ చేశాడు అని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బంధువులంతా కలిసి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా ఆ వ్యక్తి అక్కడ నుంచి పారిపోయాడు. ఈ గందరగోళం మధ్య వరుడు, అతని కుటుంబ సభ్యులు పెళ్లిని రద్దు చేసుకుని అక్కడ వెళ్లిపోవడంతో వివాహం ఆగిపోయింది. దీనిపై వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.