హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగించింది. ఆ పార్టీ నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. భారత రాష్ట్ర సమితికి చెందిన తన సమీప అభ్యర్థి మాగంటి సునీతపై ఆయన సుమారుగా 25 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ మెజార్టీ జూబ్లీహిల్స్ చరిత్రలోనే అత్యధికం కావడం గమనార్హం.
శుక్రవారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచే నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యం కొనసాగుతూ వచ్చింది. ఇది రౌండ్ రౌండ్‌కూ అది మరింత పెరిగింది. ఏ ఒక్క రౌండ్‌లోనూ భారాస అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం దక్కించుకోలేకపోయారు. ఈ గెలుపు రేవంత్‌రెడ్డి సర్కార్‌కు, కాంగ్రెస్ శ్రేణులకు ఎంతో ఉత్సాహానిచ్చింది. నవీన్ యాదవ్ విజయాన్ని ఈసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. భారత రాష్ట్ర సమితి, భాజపా అభ్యర్థులకు 2023 ఎన్నికల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. భాజపాకు డిపాజిట్ గల్లంతు కావడం గమనార్హం.
కాగా, కాంగ్రెస్ విజయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. మైనార్టీల్లో మరింత పట్టుకోసం పోలింగ్‌కు కొద్దిరోజుల ముందే అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి సమన్వయం చేశారు. క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి శ్రేణుల్లో జోష్ నింపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేలా సీఎం చర్యలు చేపట్టారు.
పేరు: వల్లాల నవీన్‌యాదవ్
తండ్రి పేరు: వి.చిన్నశ్రీశైలం యాదవ్
పుట్టిన తేదీ: 17-11-1983 (42 సంవత్సరాలు)
భార్య: వర్షయాదవ్..
కుమారుడు: అన్ష్ యాదవ్
విద్యార్హతలు: బీ.ఆర్క్ (ఆర్కిటెక్చర్)
వృత్తి: ఆర్కిటెక్ట్, స్థిరాస్తి వ్యాపారం
స్వస్థలం: యూసుఫ్‌గూడ, హైదరాబాద్
నవ యువ ఫౌండేషన్‌ను స్థాపించి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.