తాను పార్టీ మారనున్నట్టు సాగుతున్న ప్రచారంపై భారత రాష్ట్ర సమితి నేత ఎర్రబల్లి దయాకర్ రావు క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. అలాగే, ఎస్.ఐ.బి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు చేపట్టిన ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అసలు ఆయన ఎవరో తనకు తెలియదన్నారు.
ట్యాపింగ్ అంశంలో తన పేరు చెప్పాలని ప్రణీత్ రావుపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలన పూర్తిగా విఫలమైందన్నారు. ఆరు గ్యారెంటీలలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. మోసాలు చేయడం, మాయ మాటలు చెప్పడం రేవంత్ రెడ్డికి అలవాటేనని అన్నారు.
అలాగే, తాను పార్టీ మారబోతున్నట్టు సాగుతున్న ప్రచారంలో రవ్వంత కూడా నిజం లేదన్నారు. తమ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పార్టీ అభివృద్ధి కోసం ఒక సైనికుడిలా పని చేస్తానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్, పాలకుర్తి నియోజకవర్గాల బీఆర్ఎస్ కేడర్‌ను బలహీన పరిచేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
కార్యకర్తలను తప్పుదారి పట్టించేందుకే ఈ తరహా ప్రచారం సాగుతుందన్నారు. తాను బీజేపీలో చేరబోతున్నాననే వార్తల్లో నిజం లేదన్నారు. కావాలనే తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.