ప్రముఖ యోగా గురువు హనీట్రాప్‌లో పడ్డారు. హైదరాబాద్ శివారుకు చెందిన ఆ యోగా గురువును హనీ ట్రాప్ ముఠా బ్లాక్ మెయిల్ చేసింది. భారీగా డబ్బులు గుంజేసింది. అయితే పోలీసులు రంగంలోకి దిగి ఆ ముఠాను పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు.
అనారోగ్యం పేరుతో ఇద్దరు మహిళలను ఆశ్రమానికి పంపి, ఆయనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు తీసి సదరు టీమ్ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది.
వివరాల్లోకి వెళితే.. చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అయిన మిట్ట వెంకటరంగారెడ్డి రెండేళ్లుగా దామరగిద్ద గ్రామంలో సీక్రెట్ ఆఫ్ నేచర్స్ అనే యోగా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.
ఇక్కడ యోగా, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై శిక్షణ ఇస్తుంటారు. హైదరాబాద్‌కు చెందిన అమర్ అనే వ్యక్తి వెంకటరంగారెడ్డి నుంచి డబ్బు గుంజాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ మంజుల, రజని అనే ఇద్దరు మహిళలను ఆయన ఆశ్రమంలో చేర్పించాడు.
పథకం ప్రకారం ఈ మహిళలిద్దరూ యోగా గురువుకు దగ్గరయ్యారు. ఆయనతో సన్నిహితంగా మెలుగుతూ రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసి వాటిని అమర్‌కు పంపించారు.
ఆ ఫొటోలు, వీడియోలను అడ్డం పెట్టుకుని అమర్ ముఠా వెంకటరంగారెడ్డిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది. దీంతో భయపడిన ఆయన వారికి రూ. 50 లక్షల విలువైన చెక్కులు ఇచ్చారు.
అంతటితో ఆగని నిందితులు రూ. 2 కోట్లు ఇవ్వాలని మళ్లీ బెదిరింపులకు దిగడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు గోల్కొండ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను పట్టుకున్నారు.