Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జయ జయహే తెలంగాణ రచయిత అందెశ్రీ ఇకలేరు..

Advertiesment
ande sri

ఠాగూర్

, సోమవారం, 10 నవంబరు 2025 (09:32 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రచయిత, కవి అందెశ్రీ ఇకలేరు. ఆయన వయసు 64 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన... సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ నగరంలోని తన నివాసంలో ఆదివారం తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో ఆయనను కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అందెశ్రీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
 
అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. ఆయన సిద్దిపేట జిల్లా రేబర్తిలోజన్మించారు. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
 
'మాయమైపోతున్నడమ్మా' గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు. అందెశ్రీ రాసిన 'జయ జయహే తెలంగాణ'ను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రగీతంగా గుర్తించిన విషయం తెలిసిందే. ఆయనకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి పురస్కారం అందించింది.
 
ఆశు కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట. 2006లో 'గంగ' సినిమాకు ఆయనకు నంది పురస్కారం లభించింది. 2014లో అకాడమి ఆఫ్‌ యూనివర్సల్‌ గ్లోబల్‌ పీస్‌ డాక్టరేట్‌ వరించింది. 2015లో దాశరథి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం అందుకున్నారు. 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లభించింది. అందెశ్రీ లోక్‌నాయక్‌ పురస్కారాన్ని అందుకున్నారు.  
 
కాగా, అందెశ్రీ మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ, ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని వెల్లడించారు. రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ' రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. 
 
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందన్నారు. అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేసుకున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామన్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ సీఎం సంతాపం వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Mukesh Ambani: తిరుమలలో ఆధునిక ఉపగ్రహ వంటగది నిర్మాణానికి ముఖేష్ అంబానీ