Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్ మెట్రోకు ఏడు వసంతాలు.. 80 కోట్ల మంది ప్రయాణం

Advertiesment
Metro

ఠాగూర్

, శుక్రవారం, 28 నవంబరు 2025 (10:43 IST)
హైదరాబాద్ మెట్రో సేవలు ప్రారంభమై ఏడు వసంతాలు పూర్తి చేసుకుంది. ఇపుడు ఎనిమిదో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఏకంగా 80 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణం చేశారు. భాగ్యనగరి వాసులకు వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తున్న హైదారాబాద్ మెట్రో ప్రస్తుతం అత్యంత కీలకమైన ప్రజా రవాణాగా మారిపోయింది. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ, లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చడంలో కీలకపాత్ర పోషిస్తోంది. అలాంటి మెట్రో, ఇప్పుడు రెండో దశ విస్తరణకు సిద్ధమవుతోంది.
 
ప్రస్తుతం నగరంలో 69.2 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లలో మెట్రో సేవలు అందిస్తోంది. నిత్యం సుమారు 4.80 లక్షల మంది ప్రయాణిస్తుండగా, వీరిలో 51.5 శాతం మంది ఉద్యోగులే ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. త్వరగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు 30.3 శాతం మంది, విద్యార్థులు 6.1 శాతం మంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. 2017 నవంబరు 29న ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 80.21 కోట్ల మంది మెట్రోలో ప్రయాణించినట్లు అంచనా. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది.
 
2012లో పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) పద్ధతిలో రూ.14,132 కోట్ల వ్యయంతో మెట్రో ప్రాజెక్టును ప్రారంభించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రెండో దశ విస్తరణపై దృష్టి సారించింది. మొత్తం ఎనిమిది కారిడార్లలో 163 కిలోమీటర్ల మేర కొత్త లైన్లను రూ.43,848 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు (డీపీఆర్) కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. 2026 మార్చి నాటికి వీటికి అనుమతులు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రెండో దశ పూర్తయితే మహానగర రవాణా వ్యవస్థలో మెట్రో మరింత కీలకం కానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందా? డిప్యూటీ తాహసీల్దార్ కుటుంబంలో కలకలం