Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కూల్చివేతలతో వణికిపోతున్న మాజీ మంత్రి మల్లారెడ్డి... రక్షించండి మహాప్రభో అంటూ..?

కూల్చివేతలతో వణికిపోతున్న మాజీ మంత్రి మల్లారెడ్డి... రక్షించండి మహాప్రభో అంటూ..?

ఠాగూర్

, శుక్రవారం, 8 మార్చి 2024 (09:15 IST)
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితికి భారీ షాక్ తగలనుంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, తన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డితో సహా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. గురువారం ఉదయం ఆరు గంటలకు.. రాజశేఖర్‌ రెడ్డి కళాశాలలో అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రారంభం కావడంతో మల్లారెడ్డి అప్రమత్తమయ్యారు. ఉదయం 7 గంటల సమయంలో కుమారుడు మహేందర్‌ రెడ్డి, అల్లుడు రాజశేఖర్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నేత మంద సంజీవరెడ్డితో కలిసి హుటాహుటిన బయల్దేరి ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్‌ రెడ్డి ఇంటికి వెళ్లారు. 
 
మల్లారెడ్డిని చూసి ఆయన షాక్‌కు గురవడంతో.. 'నన్ను చూసి షాక్‌కు గురవుతున్నావా అన్నా?' అంటూ పలకరించారు. తన ఇంటి అడ్రస్‌ ఎలా తెలుసని ఆయన అడగ్గా.. 'తెలంగాణలో నీ ఇల్లు తెలియనివారు ఉన్నారా?' అంటూ మల్లారెడ్డి చమత్కారంగా మాట్లాడారు. అనంతరం.. తన అల్లుడి కాలేజీలో జరుగుతున్న కూల్చివేతలపై మాట్లాడారు. 'ఎలాగైనా నిలిపివేయించన్నా' అంటూ మల్లారెడ్డి ప్రాధేయపడినట్లు తెలిసింది. అయితే, ఈ విషయంలో తానేమీ చేయలేనని.. మేడ్చల్‌ రాజకీయాల్లో తలదూర్చలేనని వేం నరేందర్‌ రెడ్డి తెలపడంతో.. కనీసం సీఎం అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని కోరినట్టు తెలిసింది.
 
''మీరు హామీ ఇస్తే లక్షమందితో పార్టీలో చేరుతా'' అని మల్లారెడ్డి చెప్పినట్టు సమాచారం. దాదాపు 3 గంటలపాటు సాగిన వారి భేటీలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ తరపున తన కుమారుడికి మల్కాజిగిరి ఎంపీ టికెట్‌ ఇప్పించుకునేందుకు కూడా మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే, మల్లారెడ్డి వర్గీయులు మాత్రం కూల్చివేతలపైనే ఆయన మాట్లాడారని, రాజకీయ అంశాలేవీ ప్రస్తావనకు రాలేదని చెబుతున్నారు. దీనిపై మల్లారెడ్డిని సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెజాన్‌తో సబ్బులు, సస్టైనబిలిటీ, అంతర్జాతీయ కార్యాకలాపాలను కళాత్మకంగా మిళితం చేసిన శీతల్