Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కేసు : మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టు

phone tapping

ఠాగూర్

, బుధవారం, 13 మార్చి 2024 (12:12 IST)
phone tapping
తెలంగాణా రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అలియాస్ ప్రణీత్ కుమార్‌ను తెలంగాణ పోలీసులు మంగళవాం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనను విచారణ నిమిత్తం హైదరాబాద్ నగరానికి తరలించారు.

స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో నిధులు దుర్వినియోగం, అనధికారిక ఫోన్ ట్యాపింగ్, కంప్యూటర్ ధ్వంసం వంటి కేసులు ఆయనపై నమోదైవున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భారాస ప్రభుత్వ హయాంలో ప్రణీత్ రావు ఎస్ఐబీలో డీఎస్పీగా పనిచేశారు.

గత ఏడాది డిసెంబర్ 4న (ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు) ప్రణీత్ రావు కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లను కాల్చివేశారంటూ ఎస్బీఐ అదనపు ఎస్పీ డి.రమేశ్ ఆదివారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు పోలీసులు ఆయనపై ఐపీసీ, పీడీపీపీ, ఐటీ చట్టాల కింద ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేశారు.

ఆ తర్వాత ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే, ఆయన సస్పెండ్‌కు ముందు రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీఆర్బీలో డీఎస్పీగా పనిచేశారు. అయితే, సస్పెన్షన్ తర్వాత జిల్లా కేంద్రం దాటి వెళ్లకూడదని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రణీత్ రావును అరెస్టు చేసేందుకు సోమవారమే పంజాగుట్ట పోలీసుల బృందం సిరిసిల్లకు చేరుకున్నా జాడ దొరకలేదని సమాచారం. అయితే, స్థానిక శ్రీనగర్ కాలనీలోనే ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న ఆయనను అరెస్టు చేశామని మంగళవారం రాత్రి పోలీసులు ప్రకటించారు.

అనంతరం ఆయనను హైదరాబాద్ నగరానికి తరలించి పంజాగుట్ట ఠాణాలో విచారణ చేస్తున్నారు. విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్‌కు ఆదేశాలు ఇచ్చిందెవరు? ఎస్ఐబీలో ఎవరి ప్రోద్బలం ఉంది? ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని ఎవరికి చేరవేశారు? ధ్వంసం చేసిన కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లో ఏ సమాచారం ఉంది? అనే కోణాల్లో ఆయనను విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్లెక్సీ బ్యానర్ల వివాదం.. బీఆర్ఎస్ కార్పొరేటర్‌పై దాడి..