మన్యం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నిప్పుల కుంపటి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో వెచ్చదనం కోసం ఇంట్లో వేసిన నిప్పుల కుంపటి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
నిజానికి ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు భావించినప్పటికీ నిప్పుల కుంపటి మూలంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో పాప చికిత్స పొందుతుంది.
వనజ గ్రామానికి చెందిన మీనక మధు(35), సత్యవతి(30) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద పాప మాధురి చినమేరంగి కేజీబీవీలో, రెండో అమ్మాయి మోక్ష తాతగారి ఊరు జియ్యమ్మవలస మండలం బొమ్మికలో ఉంటూ చదువుకుంటున్నారు.
మిగిలిన ఇద్దరు పిల్లలు అయేషా(6), మోస్య(బాబు)(4) తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. వీరు నలుగురు ఎప్పటిలాగే గురువారం రాత్రి ఇంట్లో నిద్రపోయారు.
ఉదయం ఎంతకీ నిద్ర లేవకపోయే సరికి చుట్టుపక్కల వారు, బంధువులు.. అనుమానం వచ్చి తలుపులు తెరిచి చూశారు. ఇంట్లో మధు, సత్యవతి, అయేషా, మోస్య కదలిక పడి ఉండడాన్ని గమనించి వారిని ఆసుపత్రికి తరలించారు. చినమేరంగి సామాజిక ఆసుపత్రికి తరలించగా.. మధు, సత్యవతి, మోస్య అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అయేషాను పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖకు తరలించారు.