తన భార్య గీతతో తొలి పరిచయం ఊహించని రీతిలో జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఒకసారి విజయవాడలో అటల్ బిహారీ వాజ్‌పేయి గారి సభ జరిగింది. ఆ సభకు హైదరాబాద్ నుంచి కొందరితో కలిసి వెళ్లాను. తిరిగి వస్తున్నపుడు నాగార్జున సాగర్‍లో ఆగాం. అదే సమయంలో గీత తన కుటుంబంతో అక్కడికి వచ్చారు. అక్కడే మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది అని అన్నారు. ఆ పరిచయమే క్రమంగా ప్రేమగా మారి, చివరకు పెళ్ళికి దారితీసిందన్నారు. తన భార్య ఢిల్లీలోని ప్రతిష్టాత్మక లేడీ శ్రీరాం కాలేజీలో విద్యాభ్యాసం చేస్తే, తాను మాత్రం తెలంగాణాలోని ఒక ప్రభుత్వ బడిలో చదువుకున్నానని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
అలాగే, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసును 21 ఏళ్లకు తగ్గించాలని కీలక డిమాండ్ చేశారు. "21 ఏళ్లకే ఐఏఎస్ అధికారులు జిల్లాలను సమర్థంగా పరిపాలిస్తున్నప్పుడు, అదే వయసున్న యువకులు ఎమ్మెల్యేలుగా ఎందుకు పోటీ చేయకూడదు?" అని ప్రశ్నించారు. దీని కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయసును 18 ఏళ్లకు తగ్గించారని గుర్తుచేశారు.
2026లో జరగబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికలు, 2029లో దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి డబ్బు, అధికారం, మీడియా మద్దతు లేకపోయినా.. ప్రజల మద్దతు పుష్కలంగా ఉందని తెలిపారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను తెలంగాణ నుంచి పోటీ చేయమని ఆహ్వానించామని, కానీ వారు కేరళను తమ కర్మభూమిగా ఎంచుకున్నారని చెప్పారు.
బీజేపీ యువత రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని, వారి హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని అన్నారు. "దేశంలో మార్పు తీసుకురాగల శక్తి యువతకు ఉంది. యువతే మా బ్రాండ్ అంబాసిడర్లు. వారి భవిష్యత్తు కోసం వారు చేసే పోరాటం కచ్చితంగా విజయం సాధిస్తుంది" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఓట్ల దొంగతనానికి వ్యతిరేకంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో పెద్ద ఉద్యమం నడుస్తోందని, అందులో అందరూ చేరాలని విజ్ఞప్తి చేశారు.