తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. కరెంటు, నీటి కష్టాలతో సతమతమవుతున్న రైతుల కష్టాలను నిర్లక్ష్యం చేస్తోందని, పంటలను తగలబెట్టడం బాధాకరమైన చర్య అంటూ తెలిపారు.
రైతులను పట్టించుకోకుండా.. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా.. కాంగ్రెస్ సీఎంతో పాటు ఆయన మంత్రులు బీఆర్ఎస్ పాలనను నిందించడాన్ని పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు.
కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించిన 'కదన భేరి' బహిరంగ సభలో చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ హామీలను నెరవేర్చకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
"తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, మా సమస్యలను ఎత్తిచూపడానికి నేను ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ పాలకులపై కొన్ని బలమైన పదజాలాన్ని ఉపయోగించాను. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత నా రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడూ దుర్భాషలాడలేదు.
కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి తన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టకుండా, గత పాలనపై నిందలు వేయడంలో, మాటల దాడులతో బిజీగా ఉన్నారు" అని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి భాష ముఖ్యమంత్రి హోదాకు సరిపోతుందా అని ప్రశ్నించారు.