హైదరాబాదులో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. హైదరాబాదులో పట్టపగలే దోపిడీ జరిగింది. చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ షోరూమ్‌లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు దుండగులు సిబ్బందిపై కాల్పులు జరపగా.. డిప్యూటీ మేనేజర్ కాలికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించి సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
షోరూమ్ ఓపెన్ చేయగానే మాస్కులు, హెల్మెట్లతో దుండగులు వచ్చారు. దుండగులు తుపాకులతో బెదిరిస్తూ లోపలికి వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.
సీసీ కెమెరాలపై ఫైర్ చేసి, బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్‌ను దుండగులు పగలగొట్టారు. అయితే పోలీసులకు ఖజానా జువెలర్స్ స్టాఫ్ కాల్ చేయడంతో వారు కూడా వేగంగా షోరూముకు చేరుకోవడంతో పోలీసులను చూసి దుండగులు పారిపోయారు.
గాయపడిన మేనేజర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఆశ్చర్యకరంగా, దోపిడీ చేసిన ముఠా కేవలం ఒక కిలో వెండిని మాత్రమే దొంగలించింది. మొత్తం సంఘటన కొన్ని నిమిషాలు మాత్రమే కొనసాగింది.
ఈ ఘటనకు తర్వాత, నిందితులు జహీరాబాద్ వైపు పారిపోయారు. దీనితో హైదరాబాద్ పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. బహుళ బృందాలను మోహరించారు. ముఠా కదలికలను ట్రాక్ చేయడానికి, వారిని గుర్తించడానికి ఆ ప్రాంతం నుండి సీసీటీవీ ఫుటేజ్‌లను సమీక్షిస్తున్నారు.