ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లుచేశారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన పలాసలో పలు అభివృద్ధి పనులకు శుంకుస్థాపనలు చేశారు. అలాగే, డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఆ తర్వాత పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కూడా ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభను ఉద్దేశించిన ప్రసంగిస్తారు.
ఇందుకోసం ఆయన గురువారం ఉదయం 8 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి శ్రీకాకుళం జిల్లాకు చేరుకుంటారు. ముందుగా కంచలి మండలం మకరాంపురంలో డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార ఉద్ధానం మంచినీటి ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఆ తర్వాత పలాసకు చేరుకుని కిడ్నీ రీసెర్స్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. ఆ తర్వాత రైల్వే క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఈ బహిరంగ సభతో జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన ముగుస్తుంది. అక్కడ నుంచి ఆయన హెలికాఫ్టరులో తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
కాగా, ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించేందుకు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం రూ.74.24 కోట్లు ఖర్చు చేసింది. 200 పడకల ఆస్పత్రిలో రోగులకు డయాలసిస్, ఇతర వైద్య సదుపాయాలను కల్పించింది. ఐసీఎంఆర్ ఈ ప్రాంతంలోని దాదాపు 700 గ్రామాలో ప్రబలంగా ఉన్న దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిపై పరిశోధనకు మద్దతు ఇస్తుంది. వంశధార జలాశయం నుంచి సురక్షిత మంచినీటిని అందించేందుకు ప్రభుత్వం నీటి ప్రాజెక్టును కూడా నిర్మించింది.