సెప్టెంబరులో తెలంగాణ రాష్ట్ర అవతరణ: కేసీఆర్ జోస్యం
, గురువారం, 12 జులై 2012 (20:27 IST)
తెలంగాణాపై కేసీఆర్‌కు కేంద్రం ఎటువంటి హామీ ఇచ్చిందో ఏమోగానీ రాష్ట్రపతి ఎన్నికలు ముగియగానే సెప్టెంబరు నెలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ జరుగుతుందని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణ వచ్చే తరుణంలో ఉద్యమాలు చేయడమెందుకని పరోక్షంగా జేఏసీకి, కోదండరామ్‌కు చురకలు అంటించారు. రెండు నెలల్లో మన రాష్ట్రాన్ని మనం చూసుకోబోతున్నాం.. ఈ సమయంలో ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఐతే రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెరాస ఉద్యమం చేస్తుందనీ, ఆ ఉద్యమం అభివృద్ధి కోసమని అన్నారు. అంతేకాదు పనిలోపనిగా తెలంగాణ వచ్చాక తాము ఏమేం చేస్తామన్న దానిపైనా విపులంగా చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చీరాగానే ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలను 24 చేస్తామన్నారు. సాగునీరు అందని 75 నియోజకవర్గాలకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేసి తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు.