Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మొన్న ఆకర్ష్ తెదేపా.. ఇక ఆకర్ష్ కాంగ్రెస్: కేసీఆర్ టార్గెట్

Advertiesment
తెలంగాణ
, బుధవారం, 19 అక్టోబరు 2011 (12:09 IST)
FILE
తెలంగాణ సెంటిమెంట్‌తో తెరాసకు ఎన్నడూ లేనంతగా క్రమంగా బలం పుంజుకుంటోంది. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీగా ప్రజలకు పదేపదే చెపుతున్న కేసీఆర్, దాన్నే ఆయుధంగా చేసుకుని ఇతర పార్టీలను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నారు.

ఆయన ప్రధానమైన టార్గెట్ తెలుగుదేశం పార్టీ. ఆయన టార్గెట్‌కు దాదాపు తెలుగుదేశం పార్టీ కుదేలైనట్లు కనబడుతోంది. తెలంగాణ కోసం పదవులకు రాజీనామా చేసి పల్లెబాట పట్టేందుకు వెళుతున్న టి.తెదేపా తమ్ముళ్లను అడ్డుకుని వారిని నియోజకవర్గాల్లో తిరగనీయకుండా చేస్తున్నారు. చంద్రబాబుతో లేఖ ఇప్పించాలని పట్టుబడుతున్నారు.

రెండుకళ్ల సిద్ధాంతానికి బలంగా కట్టుబడి ఉన్న బాబు తన వైఖరి స్పష్టంగా ఉన్నదని చెపుతున్నారు. దీంతో తమ్ముళ్లకు తెలంగాణలో ఎదురుగాలి వీస్తోంది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ముగ్గురి సిటింగ్ తెదేపా తమ్ముళ్లు పార్టీ నుంచి జంప్ కాగా ఇద్దరు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. మిగిలినవారు పరిస్థితి కూడా అయోమయంగానే ఉన్నట్లు సమాచారం.

ఇక ఇప్పుడు కేసీఆర్ తన దృష్టిని కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా టి.జేఏసీ ఛైర్మన్ చేత తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పాతర వేయడమే ప్రధాన కర్తవ్యమని ప్రకటింపజేశారు. తద్వారా టి.కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఆ పార్టీలో ఉన్న వారిని ఆకర్షించాలనేది ఆయన లక్ష్యంగా కనబడుతోంది. ఇందుకు తగ్గట్లుగానే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నట్లు సమాచారం. వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే మంతనాలు కూడా సాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ప్రత్యేక రాష్ట్రంపై కాంగ్రెస్ నానుడు బేరం చేస్తే గులాబీ కండువా వేసుకునేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని వారు చెపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్లుగానే మధుయాష్కీ వ్యాఖ్యలు ఉన్నాయి. తెలంగాణపై పీసీసి చీఫ్ బొత్స చెప్పినా.. ఇంకెవరు చెప్పినా తాము పట్టించుకోమనీ, తెలంగాణ వచ్చేందుకు అవసరమైతే భాజపాతోనూ చేయి కలుపుతామని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

మరోవైవు గతానికి భిన్నంగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అవుతున్నారు. సెంటిమెంట్ బలంగా ఉన్న ఈ సమయంలోనే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను లాగేసుకోవాలని ఆయన చూస్తున్నట్లు చెపుతున్నారు. మొత్తమ్మీద తెలంగాణలో తెరాస తప్ప మిగిలిన పార్టీలను నామరూపాల్లేకుండా చేయాలన్నది తెరాస లక్ష్యంగా ఉందని అర్థమవుతోంది. మరి అది ఏ మేరకు నెరవేరుతుందో వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu