తెలంగాణ ఇస్తే తెరాస విలీనం... వయలార్‌తో కేసీఆర్ మాట...?!!
, సోమవారం, 17 సెప్టెంబరు 2012 (20:33 IST)
కేసీఆర్ విధించిన ఆగస్టు 20 డెడ్‌లైన్ ముగిసింది. కేంద్రం తెలంగాణ ఇస్తుందన్న కేసీఆర్ మాట గాలికి కొట్టుకుపోయింది. సిగ్నల్స్ అందుతున్నాయన్న కేసీఆర్ మాటలకు మెల్లిగా బీటలు వారుతున్నాయి. మరోవైపు ఉద్యమం కాస్తా తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ చేతుల్లోకి వెళ్లిపోతున్నట్లు కనబడుతోంది. ఇంకోవైపు మొన్నటి దాకా రెండుకళ్ల సిద్ధాంతం అంటూ చెప్పుకున్న తెదేపా కాస్తా తెలంగాణపై లేఖ ద్వారా క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమయిపోతోంది. ఇప్పుడు తెరాస పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. తెలంగాణలో ఇదే వేడిని పట్టుకు రావడం అనుకున్నంత సులభం కాదని కేసీఆర్‌కు తెలియంది కాదనుకోండి. అందుకనే ఆయన నేరుగా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో చర్చలపై చర్చలు జరుపుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలంగాణ ఇస్తే.. తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పారట. ఇదే విషయాన్ని వయలార్ కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. కేసీఆర్ రాయబారంతో సోనియా కాంగ్రెస్ సీనియర్ నాయకులతో హుటాహుటిన సమావేశమై తెలంగాణ ఏర్పాటు గురించి చర్చించినట్లు చెపుతున్నారు. అదలావుంచితే... తెలంగాణను నానబెడితే... పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు భాజపా ఇప్పటికే కసరత్తు చేస్తోందనీ, ఇంకా నాన్చుడు ధోరణి పాటిస్తే అది కూడా జరిగిపోతుందని కేసీఆర్ హెచ్చరించినట్లు సమాచారం. కేసీఆర్ హెచ్చరికల నేపధ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి పెట్టినట్లు చెపుతున్నారు. కోదండరామ్ తెలంగాణ మార్చ్‌కు పిలుపునిచ్చిన సెప్టెంబరు 30 లోపుగానే తెలంగాణపై ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించాలని కేసీఆర్ వారికి చెప్పినట్లు సమాచారం. మొత్తమ్మీద ఈసారి కేసీఆర్ మాటలు కేంద్రానికి బాగా ఎక్కినట్లు చెపుతున్నారు. కాకపోతే... తెలంగాణ ప్రకటిస్తే... సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల స్పందన ఎలా ఉంటుందన్న దానిపైనే మరింత లోతుగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ.