కేసీఆర్ ఆకర్ష్ మంత్రం: తెలంగాణలో తెదేపా భూస్థాపితమేనా..?!!
, గురువారం, 13 అక్టోబరు 2011 (18:12 IST)
తెలంగాణ సెంటిమెంట్ కేసీఆర్‌కు బాగానే వర్కవుట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్ ఆకర్ష్ పథకం దెబ్బకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కుదేలవుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ సెంటిమెంట్ తో తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్కొక్కరిగా బయటకు లాగేస్తున్న కేసీఆర్, వారిని తెరాసలో చేర్చుకుని సీట్లవ్వడమే కాకుండా, ప్రజల్లో సెంటిమెంట్ శాతాన్ని నూరుశాతం నింపేసి తన బలాన్ని మెల్లిగా పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా బాన్సువాడలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెరాస తీర్థం పుచ్చుకున్న అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డిని నిలిపారు. అసలే తెలంగాణ సెంటిమెంట్.. ఆపై కేసీఆర్ డైలాగులు.. మొత్తంగా పోచారం గెలుపు ఖాయం అని చెప్పుకుంటున్నారు. ఇదే ఊపుతో మరికొంతమంది తెదేపా నాయకులకు కేసీఆర్ గేలం వేస్తున్నట్లు సమాచారం. దీంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు బిత్తర చూపులు చూస్తున్నారు. తెలంగాణపై చంద్రబాబుకు స్పష్టత లేదని ఏకంగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావే వ్యాఖ్యానించడంతో కిందిస్థాయి కార్యకర్తలు తమదారి తాము చూసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే కొంతమంది తెరాస బాట పడుతుండగా మరికొందరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూటికి జంప్ అయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ పరిణామాలన్నిటినీ బేరీజు వేసుకున్న చంద్రబాబు త్వరలో తెలంగాణ ప్రాంతంలో యాత్ర చేపడుతానని ప్రకటించారు. మరి ఆయన యాత్ర టి.తెదేపాలో జవసత్వాలను తీసుక వస్తుందో లేదో చూడాలి.