కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు వ్యతిరేకంగా వస్తే తెలంగాణ భగ్గు: కేసీఆర్
, సోమవారం, 30 ఏప్రియల్ 2012 (20:21 IST)
బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ వచ్చే నెల 7వ తేదీన తుది తీర్పును వెలువరించనుంది. ఈ తీర్పుతో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగితే తెలంగాణ భగ్గుమంటుందని తెరాస చీఫ్ కేసీఆర్ అన్నారు. కృష్ణా బేసిన్ లో ఉన్న మూడు జిల్లాల ప్రాజెక్టులకు 77 టీఎంసీల నీటి పంపకంపై ప్రభుత్వం గట్టిగా వాదించాలని గతంలో తాము చెప్పామన్నారు. ఐతే ప్రభుత్వం ఏమి వాదించిందో తమకు తెలియదన్నారు. ట్రిబ్యునల్ తీర్పులో తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన 77 టీఎంసీల నీటి కేటాయింపులు లేవని తేలితే మరోసారి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. కనుక దీనిపై ముఖ్యమంత్రి తక్షణం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం తాము పార్లమెంటులో నిరశనలు చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పట్టడం లేదన్నారు. కనీసం ప్రధాన ప్రతిపక్షం నాయకురాలు సుష్మా స్వరాజ్ అడిగిన ప్రశ్నలకు కూడా బదులివ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉన్నదన్నారు. అందుకే తాము వాకౌట్ చేశామని చెప్పుకొచ్చారు.