కత్తి ఆంధ్రోడైతే.. పొడిచేది తెలంగాణోడు.. తెలంగాణ ఎలా వస్తది?!!: కేసీఆర్
, గురువారం, 15 మార్చి 2012 (20:58 IST)
కేసీఆర్ మరోసారి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలపై ఫైర్ అయ్యారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్, తెలుగుదేశం నాయకుల వల్లనే తెలంగాణ రావడం లేదనీ, కత్తి ఆంధ్రోడైతే.. పొడిచేది మాత్రం తెలంగాణోడేననీ, అలాంటప్పుడు తెలంగాణ ఎలా వస్తుందని ప్రశ్నించారు. అందువల్ల తెలంగాణ సాధించుకునేందుకు తెరాసకే ఓటు వేసి గెలిపించాలని కోరారు.కామారెడ్డి నియోజకవర్గంలో ప్రజలనుద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని 2009లో తాను దీక్ష చేపడితే, కేంద్రం దిగి వచ్చి తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటన చేసిందని గుర్తు చేశారు. ఆ ప్రకటన వెలువడిన కొద్ది క్షణాల్లోనే ఆంధ్ర కాంగ్రేసోడు.. తెలుగుదేశమోడు.. చిరంజీవి.. పెద్దజీవి.. చిన్నజీవి.. అంతా కలిసి తెలంగాణను అడ్డుకున్నారన్నారు. అటువంటప్పుడు ఈ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ - తెలుగుదేశం నాయకులతో సహా అంతా మూకుమ్మడి రాజీనామాలు చేద్దామని అంటే... వచ్చినట్లే వచ్చి వీపు చూపి పారిపోయారని మండిపడ్డారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు కక్కిన పదవులపై పోటీ చేసేందుకు ఇప్పుడు సిగ్గు లేకుండా ఆ పార్టీలు ప్రజల ముందుకు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఆ రెండు పార్టీలను తెలంగాణలో నామరూపాల్లేకుండా చేస్తేనే తెలంగాణ వస్తదని అన్నారు.