తెలంగాణలో కేరళీయుల సంక్షేమం కోసం ముఖ్య మంత్రి కేసీఆర్ నడుంకట్టారు. హైదరాబాద్‌లో మలయాళీ అసోసియేషన్ భవనం (కేరళ భవన్)ను నిర్మించేందుకు మహేంద్ర హిల్స్‌లో ఎకరం భూమి కేటాయించి, దాని నిర్మాణానికి కోటి రూపాయల నిధులను కేసీఆర్ ప్రకటించారు. అదేవిధంగా నగరంలో నివసిస్తున్న నిరుపేద మలయాళీయుల కుటుంబాలకు పక్కా ఇళ్లు కట్టిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.
కేరళ ప్రభుత్వ సహకారంతో నగరంలోని మలయాళీ అసోసియేషన్(సీటీఆర్‌ఎంఏ) ఆధ్వర్యంలో ఆదివారం బాలానగర్‌లోని నవీన సాంస్కృతిక కళా కేంద్రంలో కేరళీయం-2015 పేరుతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో సుమారు నాలుగు లక్షల మందికి పైగా మలయాళీలు ఉన్నారని తెలిపారు. వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేరళ మంత్రి కె.సి.జోసఫ్, ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బాల్క సుమన్‌లతో పాటు పలువురు మలయాళీయులు కూడా పాల్గొన్నారు.