హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్‌గా తెలుగు ప్రజల్లో మంచి క్రేజ్ ఉన్న హీరో మహేష్ బాబును ఎంపిక చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇదేవిషయాన్ని ఆయన కొంతమంది సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మహేష్ బాబుతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే... ముందుకు సాగాలని ప్రభుత్వం భావిస్తోంది.
మరోవైపు త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్... సెటిలర్స్ను కూడా ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 1956 కంటే ముందు నుంచి తెలంగాణలో ఉన్నవారికి మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఫాస్ట్ పథకంపై గత ఏడాది అనుసరించిన విధానాన్నే అనుసరిస్తామని చెప్పటం విశేషం.
మరోవైపు... హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. డల్లాస్ నగరం కంటే ఘనంగా భాగ్యనగరాన్ని మార్చాలని భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం కన్నా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడిందన్న విమర్శల నేపథ్యంలో హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెంచే అంశంపై కేసీఆర్ దృష్టి పెట్టారు.