తెలుగు ప్రజల అభిమాన హీరోలు మహేష్ బాబు, నితిన్‌లను రాష్ట్ర అంబాసిడర్లుగా నియమించాలని తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. పలు కోణాల్లో ఆలోచించి వారి పేర్లను బ్రాండ్ అంబాసిడర్ల కోసం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. తాను సూపర్ స్టార్ కృష్ణ అభిమానిని అని కేసీఆర్ కొద్ది నెలల క్రితం ఓ సందర్భంలో చెప్పారు. అదేసమయంలో హైదరాబాదులో ఫిల్మ్ సిటీ అద్భుతంగా నిర్మిస్తామని, బోర్డులోకి హీరో కృష్ణను తీసుకుంటామని చెప్పారు కూడా.
తెలంగాణ ఉద్యమ సమయంలో పద్మాలయ స్టూడియోపై కూడా వివాదం చెలరేగిన విషయం తెల్సిందే. ఆ తర్వాత తెలంగాణ వచ్చాక మంత్రి హరీష్ రావు, తెరాస పద్మాలయ పైన ప్లేటు పిరాయించిందని విపక్ష నేతలు కొందరు విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కృష్ణ మాట్లాడుతూ ఫిల్మ్ సిటీకి కేసీఆర్ పేరు పెట్టాలని సూచించారు.
ఈ నేపథ్యంలో మహేష్ బాబుకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. టాప్ హీరోల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబులే ముందుంటారు. పవన్ కళ్యాణ్ తెరాస ప్రత్యర్థి పార్టీలు అయిన టీడీపీ - బీజేపీలకు మద్దతుగా నిలబడుతున్నారు. పవన్, చిరంజీవి.. ఇలా హీరోలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఓ పార్టీ వైపు ఉన్నారు. మహేష్ బాబు వివాదరహితుడు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లోను మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ పోటీ చేశారు.
అయితే, మహేష్ బాబు పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా.. ఓ పార్టీ వైపు మొగ్గవద్దనే ఉద్దేశ్యంతో ప్రచారానికి దూరంగా ఉండిపోయారు. దీంతో మహేష్ బాబు పేరును కేసీఆర్ పరిశీలించినట్టు సమాచారం. మరోవైపు... నితిన్ తెలంగాణ ప్రాంతానికి చెందిన హీరో కావడంతో పాటు.. పవన్ కళ్యాణ్ పిచ్చి అభిమాని. దీంతో తెలంగాణాలో పవన్‌కు చెక్ పెట్టేందుకు నితిన్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.