కేంద్ర పథకాల కొనసాగింపుపై నీతి ఆయోగ్ పరిధిలో సబ్ కమిటీని వేయాలని కేంద్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కోరారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన 'నీతి ఆయోగ్' తొలి సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రాల అవసరాలను కేంద్రానికి వివరించారు. స్థానిక అవసరాలకు తగినట్టుగా నిధులను మంజూరు చేయాలని కేసీఆర్ కోరారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలలో కేంద్ర పథకాల యదాతథంగా కొనసాగించే విధంగా నీతి ఆయోగ్ పరిధిలో సబ్ కమిటీని వేయాలని కేసీఆర్ కోరారు. ఈ అంశంపై కేసీఆర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించినట్టు సమాచారం. రాష్ట్రంలో అమలు చేస్తున్న వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ వంటి పథకాలకు కేంద్రం భారీగా నిధులు ఇవ్వాలని సమావేశంలో కోరారు.
కాగా సమావేశ అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్బంధ విద్య అమలు, బలహీన వర్గాలకు ఇళ్ల నిర్మాణం వంటి పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేయాలని మోడీని కోరినట్టు కేసీఆర్ వెల్లడించారు.