Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : ప్రశాంతంగా పోలింగ్.. ఓటేసిన సినీ ప్రముఖులు

vote
, గురువారం, 30 నవంబరు 2023 (08:12 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, గురువారం ఉదయం నుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 2,290 మంది అభ్యర్థుల భవిత్యం నేడు తేలనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.26 కోట్లు కాగా పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 68 నియోజకవర్గాల్లో మహిళలే అభ్యర్థుల గెలుపు ఓటములు నిర్ణయిస్తారు. ఈ ఎన్నికల్లో యువత సంఖ్య అధికంగా ఉండటం మరో ప్రత్యేకత. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈసారి 18-19 ఏళ్ల వయసున్న 9, 99,667 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
 
పోలింగ్ భద్రతా ఏర్పాట్ల కోసం 75 వేల మంది పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. వీరిలో రాష్ట్రానికి చెందిన 40 వేల మంది, సరిహద్దు రాష్ట్రాలకు చెందిన 15 వేల మంది పోలీసులు, 375 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు ఉన్నాయి. రాష్ట్రంలో సమస్యాత్మకంగా మారిన 13 అసెంబ్లీ నియోజకవర్గాలు, 12,311 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 2 లక్షలకు పైగా సిబ్బంది పోలింగ్ ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారు. ఎన్నికల సంఘం నియమించిన 3,800 మంది సెక్టార్ ఆఫీసర్లు, 22 వేల మంది సూక్ష్మ పరిశీలకులు పోలింగును పర్యవేక్షించనున్నారు.
 
శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7,32,560 మంది ఓటర్లు ఉండగా భద్రాచలం నియోజకవర్గంలో అత్యల్పంగా 1,48,713 మంది ఓటర్లున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో గరిష్ఠంగా 48 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా బాన్సువాడ, నారాయణపేటలో అత్యల్పంగా ఏడుగురు చొప్పున బరిలో నిలిచారు. అభ్యర్థుల సంఖ్యను బట్టి కొన్ని నియోజకవర్గాల్లో 55 బ్యాలెట్ యూనిట్లు, మరికొన్నింటిలో రెండు లేదా మూడు బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలింగ్ పూర్తైన నాలుగు రాష్ట్రాలతో పాటూ తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపును డిసెంబర్ 3న చేపట్టి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.
 
మరోవైపు, తెలంగాణలో ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభంకావడంతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూకడుతున్నారు. పలువురు ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటు వేశారు. నటుడు ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి వచ్చి జూబ్లీహిల్స్ ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్లో ఓటు వేశారు. సినీనటుడు అల్లు అర్జున్.. జూబ్లీహిల్స్ లోని బీఎస్ఎన్ఎల్ పోలింగ్ బూత్లో ఓటు వేశారు. అందరితో పాటూ లైన్లో నిలబడి ఓటు వేసి వెళ్లారు. షాద్ నగర్లో సినీనటుడు ప్రకాష్ రాజ్ ఓటేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓటుహక్కును వినియోగించుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. వారికి డిసెంబర్ 1 కూడా సెలవు