ఈ నెల 4న తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ ఓ ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ మూడో శాసనసభకు నవంబర్ 30న ఎన్నికలు పూర్తి కాగా.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం 2024 జనవరి 16 వరకు కొనసాగుతుంది.
అయితే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి కావడంతో డిసెంబర్ 3న ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కొత్త ముఖ్యమంత్రిని నియమించే వరకు కేసీఆర్ తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. అయితే డిసెంబర్ 3న వచ్చే ఫలితాలను బట్టి ఈ కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.
కేసీఆర్ కేబినెట్ సమావేశం నిర్వహిస్తారా? లేక రద్దు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే తరుణంలో కేబినెట్ భేటీ అంశం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే ఈ సభ యథావిధిగా జరుగుతుందని చెప్పవచ్చు.