Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జై తెలంగాణ అంటూ బాబు 'ఆ విధంగా ముందుకు పోవడం'తో ఎగబడి ఓట్లు వేశారా?

జై తెలంగాణ అంటూ బాబు 'ఆ విధంగా ముందుకు పోవడం'తో ఎగబడి ఓట్లు వేశారా?
, మంగళవారం, 11 డిశెంబరు 2018 (14:44 IST)
ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఫలితాలు దాదాపు తెలిసిపోయాయి. తెలంగాణ రాష్ట్ర సమితి తిరిగి అధికారంలోకి రాబోతుందన్న సంగతి తేలిపోయింది. కేటిఆర్‌ ముందు నుంచి చెబుతూ వస్తున్నట్లు వంద సీట్లు కాకుండా 80కి పైగా స్థానాలు ఆ పార్టీకి వచ్చేలా కనిపిస్తున్నాయి.
 
ఇక్కడ టిఆర్‌ఎస్‌ గెలుపు కంటే.. ప్రజాకూటమి ఓటమి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. కాంగ్రెస్‌, తెలుగుదేశం, సిపిఐ, తెలంగాణ జనసమితి ప్రజాకూటమి పేరుతో ఎన్నికల బరిలోకి దిగాయ. తమ కూటమి అధికారంలోకి రాబోతోందని, టిఆర్‌ఎస్‌ చిత్తుచిత్తుగా ఓడిపోబోతోందని ఆ పార్టీల నేతలు పోలింగ్‌ తరువాత కూడా చెబుతూ వచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఓ అడుగు ముందుకేసి ఫలితాల తర్వాత తాను నున్నగా గడ్డం గీయబోతున్నట్లు చెప్పారు. ఇప్పుడు వస్తున్న ఫలితాలను చూస్తుంటే…. కూటమికి ఘోరపరాజయం తప్పేట్లు లేదు.
 
తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోషించిన పాత్ర చర్చనీయాంశమయింది. ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే తెలుగుదేశం ఆవిర్భవించిందో, మూడు దశాబ్దాలకుపైగా ఏ పార్టీపైన టిడిపి పోరాడుతూ వచ్చిందో… అదే పార్టీతో పొత్తుపెట్టుకునే సాహసం చేశారు చంద్రబాబు నాయుడు.
webdunia
 
తెలుగుదేశంతో పొత్తు కోసం కాంగ్రెస్‌ పార్టీ కూడా ఉవ్విళ్లూరింది. తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో ఏ ఒక్కరూ టిడిపితో పొత్తువొద్దు… అని అభ్యంతర పెట్టిన వారు కనిపించలేదు. టిడిపి కలిస్తే తిరుగులేని విజయం సాధిస్తామన్న ఆశ కాంగ్రెస్‌లో కనిపించింది.
 
తెలుగుదేశం - కాంగ్రెస్‌ పొత్తును ఆ పార్టీల కార్యకర్తలు, ప్రజలు ఆమోదిస్తారా, అంగీకరిస్తారా, జీర్ణించుకోగలరా… అని ఆ పార్టీల నేతలు ఆలోచించినట్లు కనిపించలేదు. పైస్థాయిలో నేతలు కలిసిపోతే… కిందిస్థాయిలో కార్యకర్తలూ, ఓటర్లూ కలిసిపోతారన్న గుడ్డినమ్మకంతో అసంబద్ధమైన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగారు.
 
ఆచరణలో… కాంగ్రెస్‌, టిడిపి జెండాలు రెండు పక్కపక్కన కనిపించడాన్ని నిజమైన కాంగ్రెస్‌, తెలుగుదేశం కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. అంతటితో ఆగలేదు… రాహుల్‌గాంధీ, చంద్రబాబు నాయుడు ఒకే వేదికపై నుంచి ప్రచారమూ చేశారు. ఈ అసంబద్ధమైన కలయికను ఆహో… ఓహో.. అంటూ ప్రచారం సాగింది. అపర చాణక్యుడంటూ చంద్రబాబును ఆకాశానికెత్తేశారు. చంద్రబాబు తెబ్బతో కెసిఆర్‌ బెంబేలెత్తిపోతున్నారని ప్రచారం హోరెత్తించారు.

 
తెలంగాణ విషయంలో చంద్రబాబు నాయుడు అనుకూలంగా లేరంటూ కేసీఆర్ ఎప్పటినుంచో చెపుతూనే వస్తున్నారు. తెలంగాణ ప్రజల చెవుల్లో ఇల్లు కట్టుకుని మరీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో బాబు తాము విభజనకు వ్యతిరేకమని చెబుతారు. తెలంగాణలో విభజనకు అనుకూలమని చెబుతారు. ఈ ధోరణి తెలంగాణ ప్రజల్లో టిడిపిపై ఆగ్రహానికి కారణమయింది. అందుకే 2014 ఎన్నికల్లో నామమాత్రపు స్థానాలతో టిడిపి సరిపెట్టుకుంది.

 
తెలుగుదేశం తీరును తెలంగాణ ప్రజలు మరచిపోయి వుంటారన్న గుడ్డి నమ్మకంతో ఈ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారానికి వెళ్లారు. ఖమ్మంలో మొదటి ప్రచారసభలో పాల్గొన్న బాబు… బెరుకుబెరుకుగా మాట్లాడారు. కెసిఆర్‌ తనను దూషిస్తున్నా… తాను మాత్రం అలాంటి దూషణలకు వెళ్లబోనని చెప్పిన ఆయన… కొన్ని గంటల్లోనే హైదరాబాద్‌కు వెళ్లి కెసిఆర్‌పై తీవ్రంగా విరుచుకుపడటం మొదలుపెట్టారు. రోజులు గడిచే కొద్దీ కెసిఆర్‌పై విమర్శల తీవ్రత పెంచారు. తానే తెలంగాణకు నిజమైన నాయకుడినని చెప్పుకునే స్థాయికి వెళ్లారు. హైదరాబాద్‌ను తానే నిర్మించానని పదేపదే ప్రచారం చేసుకున్నారు.
webdunia
 
చంద్రబాబు ప్రచారం తీరు గమనిస్తే…. మళ్లీ ఆయన తెలంగాణను ఆక్రమిస్తున్నారన్న భావన అక్కడి ప్రజల్లో కలిగి వుంటుందనడంలో సందేహం లేదు. అందుకే తెలంగాణ ప్రజల్లో మరోసారి సెంటిమెంట్‌ రగులుకుంది. చంద్రబాబును ఓడించడం కోసమైనా ఓటు వేయాలన్న భావనతో ఓటుకు వెళ్లినవారు ఉన్నారనే ప్రచారమూ సాగుతోంది.

 
టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన వారిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చిన బాబు…. ఆంధ్రప్రదేశ్‌లో తాను చేసిందేమిటి? 23 మంది వైసిపి ఎంఎల్‌ఏలను తీసుకుని, అందులో నలుగురికి మంత్రి పదవులూ కట్టబెట్టారు. చంద్రబాబు చేసిన పనే కెసిఆర్‌ చేశారు. ఈ అంశం జోలికి వెళ్లకుండా ఉండాల్సింది. తాను ఏది చెప్పినా చెల్లుబాటు అయిపోతుందన్న నమ్మకంతో మాట్లాడారు.

 
ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు రెండు లక్షల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు…. తెలంగాణలో కెసిఆర్‌ చేసిన అప్పులను పెద్దగా భూతద్దంలో చూపించే ప్రయత్నం చేశారు. కెసిఆర్‌ అప్పులు చేసివుండొచ్చు…. అదేదో ఎవరూ చేయని నేరంగా బాబు పదేపదే ప్రచారం చేశారు.
 
ఇక హైదరాబాద్‌లో స్థిరపడ్డ సీమాంధ్రులను దృష్టిలో పెట్టుకుని బాబు ప్రచారం చేశారు. టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా సెటిలర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్‌ఎస్‌ వ్యవహార శైలి ఎలా వున్నప్పటికీ…. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత సీమాంధ్రులకు చీమకుట్టినంత హాని కూడా టిఆర్‌ఎస్‌ తలపెట్టలేదు. తెలంగాణ ప్రజలకంటే మిన్నగా చూసుకుందన్న భావన అక్కడి సీమాంధ్రుల్లో కలిగింది. ఈ వాస్తవాన్ని విస్మరించి…. సీమాంధ్రులను టిఆర్‌ఎస్‌పై ఉసిగొల్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాలు ఫలించలేదన్న సంగతి ఫలితాలను చూస్తే బాగా అర్థమవుతుంది. ఇది బాబుకు పెద్ద దెబ్బే.

 
హైదారాబాద్‌లోని సీమాంధ్రులంతా తెలుగుదేశం పార్టీ గుత్త సొత్తేమీ కాదు. 2014 ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌పై కోపంతో టిడిపికి ఓట్లు వేసి వుండొచ్చుగానీ… ఇప్పుడు టిఆర్‌ఎస్‌పై అటువంటి కోపం లేదు. అందుకే గ్రేటర్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. ఈ ఎన్నికల్లోనూ అదే ధోరణి వ్యక్తమయింది.
 
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు తెలంగాణ ఎన్నికల్లో ప్రభావం చూపాయి. హైదరాబాద్‌లోని సీమాంధ్రులు…. వైసిపి, టిడిపి, జనసేనగా విడిపోయివున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ మూడు పార్టీల మధ్య బలమైన విభజన జరిగిపోయింది. ఒకరినొకరు శత్రువుల్లా చూస్తున్నారు. అందుకే…. తెలంగాణలో బాబు గెలవకూడదని వైసిపి, జనసేన మద్దతుదారులు కంకణం కట్టుకుని పని చేశారు. తాము అభిమానించే పార్టీలో పోటీలో లేవు కాబట్టి…. మరో ఆలోచన లేకుండా టిఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చారు.

 
ఇక కాంగ్రెస్‌ మద్దతుదారులుగా ఉన్నవారు కూడా… చంద్రబాబు పుణ్యమా అని టిఆర్‌ఎస్‌ వైపు వెళ్లారు. కాంగ్రెస్‌ పార్టీ టిడిపితో కలిసిన తరువాత…. అప్పటిదాకా కాంగ్రెస్‌కు ఓటేయాలనుకున్నవారు కూడా ముందూవెనుకా ఆలోచించకుండా టిఆర్‌ఎస్‌కు ఓట్లేశారు. ఏ విధంగా చూసుకున్నా…. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోవడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదుగానీ…. తెలుగుదేశం వ్యవహరించిన తీరు మాత్రం ప్రజలు ఆమోదించేలా లేదు. అందుకే ఇంతటి ఘోర పరాజయాన్ని పార్టీగానూ, కూటమిగానూ మూటగట్టుకుంది. తెలంగాణలో జై తెలంగాణ అంటూ చంద్రబాబు మొదలుపెట్టిన ప్రచారానికి ఫలితంగా ఇలా చుక్కలు కనిపించాయి. మొత్తమ్మీద ఇక్కడి ఫలితాలు... వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో జరగబోయే ఏపీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయనే వాదనలు వినిపిస్తున్నాయి. చూడాలి... ఏం జరుగుతుందో?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ ఎన్నికలు : చిత్తుగా ఓడిన తెరాస మంత్రులు