తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం బుధవారం సాయంత్రంతో ముగిసింది. పెక్కుమంది అభ్యర్థులు తాము దాఖలు చేసిన నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
అయితే, ప్రధాన పార్టీల అభ్యర్థుల కంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వారి హడావుడి ఎక్కువగా ఉంది. వారు ఎన్నికల్లో గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు.
అధికార పార్టీ అభ్యర్థులైతే తమతమ పార్టీల అధికారిక గుర్తుపై ఓటు వేసి గెలిపించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ స్వతంత్ర అభ్యర్థులు మాత్రం ఇందుకుభిన్నంగా ప్రచారం చేస్తున్నారు. తమను ఎన్నికల్లో గెలిపిస్తే నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీ ఇస్తున్నారు.
ఇలాంటివారిలో జగిత్యాల జిల్లా కోరుట్ల అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆకుల హన్మాండ్లు వెరైటీగా హామీ ఓటర్లకు హామీ ఇస్తున్నాడు. తాను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తనను చెప్పుతో కొట్టిమరీ పని చేయించుకోవాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాడు.
అందుకే ఇంటింటికీ తిరుగుతూ కరపత్రం, రాజీనామా పత్రంతో పాటు చెప్పులు కూడా పంచుతున్నాడు. తన పనితనం నచ్చకపోతే తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీకి పంపించి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని ఎవరైనా రద్దు చేయించొచ్చంటూ వివరిస్తున్నారు. గత 70 యేళ్లుగా మోసపోయారనీ, ఇకపై అలా జరగకుండా ఉండాలంటే స్వతంత్ర అభ్యర్థి అయిన తనను గెలిపించాలంటూ ఆకుల హన్మాండ్లు కోరుతున్నారు.