ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా సోమవారం జరిగిన వార్మప్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ టీం ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. లార్డ్స్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ప్రాక్టీసు ట్వంటీ- 20 మ్యాచ్‌లో టీం ఇండియా తొమ్మిది పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ట్వంటీ- 20లో భారత్‌పై పరాజయమెరుగని కివీస్ మరోసారి తన సత్తా చాటింది.
171 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీం ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 161 పరుగులే చేసింది. రోహిత్ శర్మ (36), రైనా (45), జడేజా (41 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చేందుకు విఫలయత్నం చేశారు. కెప్టెన్ ధోనీ (6), ఓపెనర్ గంభీర్ (14), యూసుఫ్ పఠాన్ (2) రాణించలేకపోవడంతో భారత్ లక్ష్యఛేదనలో వెనుకబడింది.
ఏడో ఓవర్‌లో కివీస్ కెప్టెన్ వెటోరి.. రోహిత్, ధోనీ వెంటవెంటనే అవుటవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఇదిలా ఉంటే మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల పతనానికి 170 పరుగులు చేసింది. రాస్ టేలర్ (41), బ్రెండన్ మెక్‌కలమ్ (31), స్టైరిస్ (29), ఫ్రాంక్లిన్ (27) రాణించడంతో ప్రత్యర్థి ముందు కివీస్ బలమైన లక్ష్యాన్ని ఉంచింది.