కావలసిన పదార్థాలు :
మైదా - 100 గ్రాములు, బెల్లం - అరకిలో, కొబ్బరి చిప్ప - ఒకటి, పంచదార - పావు కప్పు, నెయ్యి - పావు కప్పు, ఏలక్కాయలు - పది, జీడిపప్పు - ఆరు.
తయారు చేయు విధానం :
ముందుగా మైదాపిండిని శుభ్రమైన నీటిలో వేసి ఉండలుగా లేకుండా చేసి గంటసేపు నానబెట్టండి. తర్వాత మైదాను సన్నని వస్త్రంలో వేసి వడగట్టండి. విడిగా తీసుకున్న మైదాపాలు మూడు కప్పుల మేర ఉండాలి. అలాగే బెల్లాన్ని నీటిలో వేసి కరిగించి దానిని వేడి చేసి పాకం పట్టి దించండి. ఈ పాకం కూడా మూడు కప్పుల వరకు ఉండాలి.
కొబ్బరిని కోరి అందులోంచి ఆరు కప్పుల పాలు తీసి పెట్టుకోండి. స్టవ్ మీద ఓ పాత్ర పెట్టి అందులో కొబ్బరిపాలు, మైదాపాలు, బెల్లం పాకాలను వేసి కలపాలి. మరో పాత్రలో పంచదారను వేసి కరిగించి పాకం పట్టండి. తర్వాత దీనిని మైదా, బెల్లం మిశ్రమంలో వేసి బాగా తిప్పండి.
ఇది కాస్త గట్టిపడ్డాక ఇందులో నెయ్యి వేసి కలపండి. తర్వాత ఏలక్కాయలను పొడిగా చేసి ఇందులో వేసి కలపండి. చివరగా నేతిలో వేయించిన జీడిపప్పు పలుకులను పైన అలంకరించండి.