కావలసిన పదార్థాలు :
గోధుమ పిండి... పావు కేజీ
పచ్చి శనగపప్పు... పావు కేజీ
బెల్లం... పావు కేజీ
పచ్చికొబ్బరి... ఒక చిప్ప
యాలక్కాయలు... పది
నూనె... అరకేజీ
తయారీ విధానం :
ముందుగా పచ్చి శనగపప్పులో రాళ్ళు లేకుండా చేసుకోవాలి. బెల్లం తరిగి ఉంచుకుని, యాలక్కాయలను పొడిచేసి ఉంచుకోవాలి. అలాగే, పచ్చికొబ్బరిని తురిమి, గోధుమపిండిని జల్లించుకోవాలి. తరువాత పచ్చి శనగపప్పును రెండు గంటలపాటు నానబెట్టి నీళ్ళన్నీ ఒంపేసి... కుక్కర్‌లో ఉడక బెట్టాలి. ఉడికిన పప్పును బాగా ఆరనివ్వాలి. తరువాత రోట్లోగానీ, మిక్సీలోగాని వేసి మెత్తగా నూరుకోవాలి.
తురిమిన బెల్లంను మెత్తగా నూరుకున్న పప్పుకు కలపాలి. చివరిగా కొబ్బరి, యాలక్కాయల పొడిని కూడా కలపాలి. ఇలా చేసినప్పుడు పిండి జారుగా అయినట్లు అనిపిస్తే కాసేపు పొయ్యిమీద ఉంచితే గట్టిపడుతుంది. అయితే వేడిచేసేటప్పుడు అడుగంటకుండా జాగ్రత్తపడాలి. పిండి గట్టిపడిన తరువాత తీసి మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసి పెట్టుకోవాలి.
మరోవైపు జల్లించి ఉంచుకున్న గోధుమపిండిలో కాస్తంత ఉప్పువేసి జారుగా కలుపుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోసి, మరుగుతుండగా పూర్ణం ఉండలను గోధుమపిండిలో ముంచి వేయాలి. బంగారు వర్ణం వచ్చేదాకా వాటిని వేయించి తీసేయాలి. అంతే గోధుమపిండి పూర్ణాలు సిద్ధమైనట్లే..! వేడి చల్లారిన తరువాత వీటిని తింటే చాలా రుచిగా ఉంటాయి.