ఇంట్లోనే తయారు చేసుకునే గులాబ్ జామూన్లంటే మీకిష్టమా..? ఇష్టమైనట్లయితే... ఇక ఆలస్యం ఎందుకు.. పదండి. వంటింట్లోకి... కింద చెప్పినట్లుగా సాధ్యమైనంత త్వరగా తియ్య తియ్యని జామూన్లను తయారు చేసుకోవచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా...
కావలసిన పదార్థాలు :
పంచదార... రెండు కప్పులు
మిల్క్ పౌడర్... ఒక కప్పు
కోడిగ్రుడ్డు... ఒకటి
కార్న్‌ఫ్లోర్... ఆరు టీస్పూన్లు
వంటసోడా... ఒక టీస్పూన్
నీరు... నాలుగు కప్పులు
వెన్న... మూడు టీస్పూన్లు
నెయ్యి... జామూన్లను వేయించేందుకు సరిపడా
తయారీ విధానం :
కార్న్‌ఫ్లోర్, మిల్క్ పౌడర్, వంటసోడాలను ఒక పాత్రలోకి తీసుకుని బాగా కలపాలి. వీటికి వెన్న, గుడ్డు మిశ్రమాన్ని కూడా చేర్చి బాగా మెత్తగా చపాతీ పిండిలాగా కలిపి, ముద్ద చేసుకోవాలి.
ఈ ముద్దలోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని నిమ్మకాయంత ఉండలుగా చుట్టాలి. వీటిని బాగా కాగుతున్న నెయ్యిలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసేయాలి. అలా మొత్తం ఉండలను వేయించి ఉంచాలి.
ఇప్పుడు నాలుగు కప్పుల నీటిలో, పంచదారను వేసి స్టౌపై పెట్టి సన్నటి మంటమీద తీగపాకం వచ్చేలాగా ఉడికించాలి. పాకం బాగా ఏర్పడిన తరువాత పైన వేయించి ఉంచుకున్న ఉండలను ఉడుకుతున్న పాకంలో వేయాలి. అలాగే కాసేపు ఉంచి దించేయాలి. అంతే క్విక్ గులాబ్ జామూన్‌లు రెడీ అయినట్లే...! వేడి చల్లబడిన తరువాత తియ్యని జామూన్లను అతిథులకు సర్వ్ చేయండి.