కావలసిన పదార్థాలు :
సన్న బియ్యం - పావు కిలో, బెల్లం - అరకిలో(రుచికి తగ్గట్టు), పాలు - అరలీటరు, కొబ్బరి చిప్పలు -నాలుగు, ఏలకుల పొడి - అర చెంచా, కుంకుమ పువ్వు - చిటికెడు, కిస్మిస్ - చెంచా, జీడిపప్పు - చెంచా, పచ్చకర్పూరం - చిటికెడు.
తయారు చేయు విధానం :
ముందుగా బియ్యాన్ని కడిగి నీళ్లు కారిపోయే పాత్రలో పెట్టి నీళ్లు పోయేంత వరకు ఉంచాలి. బెల్లాన్ని ముందుగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. కొబ్బరి చిప్పలను కోరి మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేయాలి. కొబ్బరి పేస్ట్‌ను సన్నని బట్టలో పెట్టి పాలు పిండాలి. రెండు మాడు సార్లు కొబ్బరిని బాగా పిండి పాలను గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
కుంకుమ పువ్వును నానబెట్టుకోవాలి. అలాగే జీడిపప్పు, కిస్మిస్లను నేతిలో వేయించి పెట్టుకోవాలి. ఓ పాత్రలో నీళ్లు పోసి కాగిన తర్వాత అందులో కడిగి పెట్టుకున్న బియ్యాన్ని పోయాలి. అవి కాస్త ఉడికాక, ఇందులో పాలు పోయాలి. పాలు కాగిన తర్వాత ఇందులో కొబ్బరిపాలను పోసి ముప్పావు గంటపాటు ఉడికించాలి.
దీనిని గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఇది ఉడికిన తర్వాత చిక్కని పాయసం తయారవుతుంది. ఇందులో బెల్లాన్ని వేసి పాకం వచ్చేలా తిప్పాలి. తర్వాత కుంకుమపువ్వు, జీడిపప్పు, కిస్మిస్లను వేసి తిప్పి దించాలి. ఇందులో పచ్చకర్పూరం కూడా వేసి మూత పెట్టి కాసేపాగి సర్వ్ చేయాలి.