అసలే కరోనావైరస్. ఇదివరకు క్యారెట్, బీట్రూట్ వంటివి తెస్తే జ్యూస్ చేసుకుని తీసుకునేవాళ్లం. కానీ ఇప్పుడు పచ్చివి తీసుకుంటే ఏమవుతుందోనన్న భయం వెంటాడుతుంది. కనుక అలా తినడానికి భయపడేకంటే వాటిని చక్కగా హల్వాలా చేసుకుని తింటే సరి.
బీట్‌రూట్ కూరగా మాత్రమే కాకుండా హల్వాలాగా కూడా చేయటం వలన పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇది మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచటానికి ఎంతగానో దోహదపడుతుంది. కనుక ఎక్కువుగా పిల్లలకు దీనిని పెట్టడం వలన రక్తహీనతను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు బీట్ రూట్‌తో హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
కావలసిన పదార్ధాలు...
బీట్ రూట్ తురుము-3 కప్పులు,
బొంబాయి రవ్వ- ముప్పావు కప్పు,
మంచి నీళ్లు- ఒకటిన్నర కప్పు,
నెయ్యి- 4 టేబుల్ స్పూన్లు,
పంచదార - 2 కప్పులు,
జీడిపప్పు- 2 టేబుల్ స్పూన్లు,
ఎండు ద్రాక్ష- 2 టేబుల్ స్పూన్లు,
బాదం-10,
యాలకుల పొడి-అరటీస్పూన్
తయారుచేసే విధానం....
బీట్‌రూట్ తొక్కు తీసి సన్నగా తురమాలి. పాన్‌లో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, బొంబాయి రవ్వ వేసి సుమారు 5 నిమిషాలు వేయించి తీసి, ఆరనివ్వాలి. అదే పాన్‌లో మరో టీ స్పూన్ నెయ్యి వేసి సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు వేసి వేయించాలి. తరువాత ఎండుద్రాక్ష కూడా వేసి వేగాక అన్నీ తీసి ప్రక్కన ఉంచాలి.
ఇప్పుడు అదే బాణలిలో మిగిలిన నెయ్యి, బీట్ రూట్ తురుము వేసి మధ్యస్థమైన మంట మీద బాగా కలపాలి. తరువాత మంచినీళ్లు, పంచదార వేసి బాగా కలపాలి. ఇప్పుడు మూతపెట్టి మీడియం మంట మీద నీరంతా ఆవిరయ్యే వరకు ఉడికించాలి. తరువాత యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష అన్నీ వేసి కలిపి దించాలి.