బాద్షాలనే బానిసలుగా చేసేసే "బాదుషాలు"
నమ్మలేక పోతున్నారా.. అయితే బాదుషాలు తిని చూడండి...
కావలసిన పదార్థాలు :
మైదా... 4 కప్పులు
వెన్న... 8 టీ.
పంచదార... 3 కప్పులు
బేకింగ్‌సోడా... అర టీ.
ఉప్పు... చిటికెడు
యాలకులపొడి... ఒక టీ.
కుంకుమపువ్వు... పది రేకులు
నెయ్యి... వేయించేందుకు సరిపడా
తయారీ విధానం :
మైదాలో బేకింగ్‌సోడా కలపాలి. అందులోనే కొద్దిగా నీళ్లు చల్లి, వెన్న వేసి పిండిని మెత్తని ముద్దలా కలపాలి. అలాగని మరీ గట్టిగా చపాతీల పిండిలా కాకుండా కాస్త మెత్తగా ఉండేలా కలపాలి. ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని, అరచేతిలో కాస్త వత్తి, మధ్యలో చిన్న గుంట వచ్చేలా చూపుడువేలితో వత్తాలి. బాణలిలో నెయ్యి వేసి, కాగాక ఈ బాదుషాల్ని వేసి బంగారువర్ణంలోకి వచ్చేలా వేయించాలి.
విడిగా ఓ గిన్నెలో పంచదార, కప్పు నీళ్లు పోసి పాకం రానివ్వాలి. అందులోనే కుంకుమపువ్వు, యాలకులపొడి వేసి కలపాలి. లేతపాకం వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి. వేగిన బాదుషాల్ని చక్కెర పాకంలో వేసి రెండుమూడు నిమిషాలు ఉంచి తీయాలి. పాకంలో ఎక్కువసేపు ఉంచకూడదు. చల్లారాక తింటే భలే రుచిగా ఉండే ఈ బాదుషాలు బాద్షాలనే కాకుండా, ఎవరినయినా సరే బానిసలుగా చేసేసుకుంటాయి.