దుష్ట శిక్షణ-శిష్ట రక్షణకై శ్రీ కృష్ణ జననం
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ || గీ 4-7 అని శ్రీ కృష్ణభగవానుడు ! ఓ అర్జునా ! ధర్మమునకు హాని కలిగినప్పుడు అధర్మము పెచ్చరిల్లినప్పుడును నన్ను నేను సృజించుకొందును. అనగా సాకార రూపముతో ఈ లోకమున నేను అవతరింతును, అని భగవద్గీతలో చెప్పియున్నాడు. ఈ భారతావని శ్రీ కృష్ణ పరమాత్ముడిని తెలియని వారంటూ ఉండరు. ఆయనే ఈ నవభారత నిర్మాణానికి సూత్రధారుడని పురాణాలు చెబుతున్నాయి. సృష్టికర్త అయిన విష్ణుమూర్తి అవతారాల్లో ఒకరైన శ్రీ కృష్ణ భగవానుడు సామాన్య జనుల మధ్య, సామాన్య మానవుడి రూపంలో జన్మించి నివురుగప్పిన నిప్పులా దినదినాభివృద్ధి చెందుతూ ధర్మానికి ఆటంకం కలిగించే శక్తులను తనలో ఉన్న మధ్యాహ్న సూర్యకాంతితో మండించే శక్తిలా అవతరించాడు. దుష్టశక్తులను నశింపజేస్తూ.. సామాన్య జనులకు ఊరట కలిగిస్తూ.. మానవులందరు ఎలా కలిసి మెలసి జీవించాలో జ్ఞానబోధను చేస్తూ ముందుకు సాగిపోతుంటాడు. అట్టి "శ్రీకృష్ణావతార జన్మదినం" మనకు చాలా పవిత్రమైన పుణ్యదినంగా పరిగణిస్తుంటాం. శ్రీ ముఖనామ సంవత్సర దక్షిణాయన వర్షఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రం నాల్గోపాదం బుధవారం నాడు అర్థరాత్రి యదువంశంలో దేవకీదేవీ, వసుదేవుల పుత్రునిగా "శ్రీకృష్ణుడు" జన్మించాడు. అంటే! (క్రీస్తు పూర్వి 3228 సంవత్సరం).దేవకి వసుదేవులకు ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణపక్షం అష్టమి తిధి రోజు కంసుడు చెరసాలలో కృష్ణుడు జన్మించిన పవిత్రదినాన్ని "శ్రీకృష్ణాష్టమి"గా భారతీయులంతా ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు.కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని కూడా పిలుస్తారు.అందుచేత కృష్ణాష్టమి రోజున ఆ దేవదేవుడిని భక్తిశ్రద్ధలతో పూజించి, శ్రీకృష్ణ జయంతి వ్రతం ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా.. శ్రీకృష్ణ జయంతి వ్రతమాచరిస్తే కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం పేర్కొంది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా బ్రహ్మాండ పురాణం వివరించింది. కాబట్టి అందరూ శ్రీకష్ణాష్టమి రోజున కృష్ణమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిద్దాం..