శ్రీరామనవమి రోజున శ్రీరాముని భక్తిశ్రద్ధలతో పూజిస్తాం. అయితే పానకం వడపప్పు గల మహాత్మ్యం ఏమిటో మీకు తెలుసా.. రామునికి నైవేద్యంగా సమర్పించే ''వడపప్పు''తో కలిగే మేలెంతో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. కైలాసంలో ఒక రోజు పార్వతీదేవి పరమశివుడిని ఈ విధంగా ప్రశ్నించింది 'స్వామీ! 'కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం' అని విష్ణు సహస్రనామ స్తోత్రానికి కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరింది. దానికి ఈశ్వరుడు 'ఓ పార్వతీ! నేను నిరంతరం ఆ ఫలితం కోసం జపించేది ఇదే సుమా!' అని చెప్పి ఈ శ్లోకంతో మంత్రోపదేశం చేశాడు .
శ్లో : శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే !
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే !!
ఈ శ్లోకం మూడుసార్లు స్మరించినంత మాత్రానే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు. భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. 'రామ' అంటే రమించడం అని అర్థం కాబట్టి మనం ఎప్పుడూ మన హృదయాలలో శ్రీరాముని స్మరిస్తూ ఉండాలి. ఎవరైతే భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలో మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవశంకరుడే ఈ తారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తారన్నది భక్తుల విశ్వాసం.
'రా' అనే అక్షరం పలకగానే నోరు తెరుచుకుని మనలోపల ఉన్న పాపాలు అన్నీ బయటకు వచ్చి రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. 'మ' అనే అక్షరం ఉచ్చరించినప్పుడు నోరు మూసుకుంటుంది కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మానవుల శరీరాలలోకి ప్రవేశించలేవు. ముఖ్యంగా శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది కాబట్టి శ్రీరాముడిని పూజించిన తరువాత కొత్తకుండలో మిరియాలు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి పంచి పెడతారు.
ఈ ప్రసాదాల వెనుక ఆయుర్వేదిక పరమార్థం కూడా ఉంది. భగవంతుడికి నివేదించే ప్రసాదాలు అన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. శరద్ రుతువు, వసంత రుతువు యముడి కోరలు లాంటివే అని దేవీ భాగవతం చెబుతోంది. పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని ప్రసాదిస్తూ, ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అదే కాకుండా పానకం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది.
అలాగే పెసరపప్ప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది, జీర్ణశక్తి అభివృద్ధి పరుస్తుంది, దేహకాంతి, జ్ఞానానికి ప్రతీక పెసరపప్పునే వడపప్పు అంటారు ఇది మండుతున్న ఎండలలో 'వడదెబ్బ' కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుంది. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనదని పండితులు అంటున్నారు.