Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దంగల్ సిస్టర్ రితికా ఫోగాట్ ఆత్మహత్య.. ఓటమితో మనస్తాపం.. ఉరేసుకుని..?!

దంగల్ సిస్టర్ రితికా ఫోగాట్ ఆత్మహత్య.. ఓటమితో మనస్తాపం.. ఉరేసుకుని..?!
, గురువారం, 18 మార్చి 2021 (11:27 IST)
Ritika Phogat
దంగల్‌ బయోపిక్ స్టార్, ప్రముఖ మహిళా రెజ్లర్‌ బబితా ఫోగాట్‌ సోదరి (కజిన్‌ సిస్టర్‌) రితికా ఫోగాట్‌ ఓటమిని భరించలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన యావత్‌ క్రీడా ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ఒక్క చిన్న ఓటమికే తనువు చాలించడం పట్ల అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. 17ఏళ్ల రితికా ఫోగట్‌ మహావీర్‌ ఫోగట్‌ అకాడమీలో గత ఐదేళ్లుగా రెజ్లింగ్‌ క్రీడలో శిక్షణ తీసుకుంటోంది. 
 
ఈ నేపథ్యంలో రితికా తాజాగా భరత్‌పూర్‌లోని లోహ్‌ఘర్‌ స్టేడియంలో మార్చి 12 నుంచి 14 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్‌ ఉమెన్‌, సబ్‌ జూనియర్‌ పోటీల్లో పాల్గొంది. ఈ క్రమంలో టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి మంచి ప్రతిభను కనబరిచిన రితికా ఫైనల్‌కు చేరుకుంది. 
 
అయితే మార్చి 14న జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో కేవలం ఒక్క పాయింట్‌ తేడాతో ఓటమిని చవిచూసింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన రితికా.. తన సొంత గ్రామమైన బాలాలిలో మార్చి 15న ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
ఇక పోలీసులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం రితికా మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. మార్చి 16న రితికా కుటుంబసభ్యులు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
 
కాగా.. బబితా ఫోగాట్‌తో పాటు ఆమె సోదరీమణులు కూడా రెజ్లింగ్‌లో మేటి ప్లేయర్స్‌ అనే విషయం తెలిసిందే. మహావీర్‌ ఫోగాట్‌ తన కూతుళ్లను మేటి కుస్తీ క్రీడాకారిణీలుగా తీర్చిదిద్దాడు. వీరి కథ ఆధారంగానే బాలీవుడ్‌లో అమీర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో ‘దంగల్‌’ అనే సినిమా తెరకెక్కింది.
 
ఈ నేపథ్యంలో రితికా ఫోగట్ సోదరుడు మీడియాతో మాట్లాడుతూ... 'ఆటలో గెలుపోటములు సహజమే. రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో ఓడిపోవడం పెద్ద విషయమేమి కాదు. రితికా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలియట్లేదు. కోచ్‌ మహావీర్‌, మా తండ్రి మెన్‌పాల్‌ కూడా మ్యాచ్‌ జరుగుతోన్న సమయంలో రితికాతోనే ఉన్నారు. ఓటమి తర్వాత రితికతో మాట్లాడారు. మరింత కష్టపడితే విజయాలు అవే వస్తాయని భరోసా ఇచ్చారు. అయినా రితికా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం షాక్‌కి గురిచేసింది' అని తెలిపాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోతేరాలో కీలక పోరు : గెలిస్తేనే టైటిల్ రేసులో నిలబడేది!